ఆదిలాబాద్ రూరల్/బోథ్, జూలై 20 : గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(జీఎస్టీ)తో కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తున్నదని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనబాట పట్టారు. నిత్యావసరాలైన పాలు, పాల ఉత్పత్తులపైనా జీఎస్టీ విధిస్తూ వీటిపై ఆధారపడ్డ రైతుల పొట్టగొడుతున్నదని మండిపడ్డారు. జాతి ప్రయోజనాల కోసమే వస్తు, సేవల పన్ను తెచ్చామని బీజేపీ సర్కారు గొప్పలు చెప్పుకుంటూ అన్ని రంగాల వారిని ఇబ్బందులు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడి రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు, పాల ఉత్పత్తులపైనా కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొదటిసారి పన్ను విధించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఆందోళనబాట పట్టారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా కేంద్ర బీజేపీ వైఖరిని ఎండగట్టారు. వస్తు, సేవల పన్నుతో రైతులకు బీజేపీ సర్కారు చేస్తున్న నష్టం, ప్రజలపై పడుతున్న భారంపై నిరసనలు చేశారు. మోదీ డౌన్ డౌన్.. వెంటనే జీఎస్టీ ఎత్తివేయాలి నినాదాలు చేశారు. పన్ను పోటుకు వ్యతిరేకంగా ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల నాయకులు మాట్లాడుతూ.. గతంలో నల్లచట్టాలతో రైతుల ఉసురు తీసిందని.. నేడు పాలు, పాల ఉత్పత్తులపై పన్నుతో అన్నదాతల పొట్టగొడుతున్నదని దుయ్యబట్టారు. రైతులపై కేంద్రం మొదటి నుంచి వివక్ష చూపుతున్నదన్నారు. జిల్లాకేంద్రంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాగా, జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతోపాటు బోథ్ నియోజకవర్గ కేంద్రంలో జీఎస్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలో డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి జగ్జీవన్‌రామ్ చౌక్ వరకు ర్యాలీ తీశారు. పాలక్యాన్లు పట్టుకొని నినాదాలు చేశారు. పాలల్లో రొట్టెలు వేసుకొని తింటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భోజారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరిట పాలు, పాల ఉత్పత్తులపై విధించడం సిగ్గు చేటన్నారు. సామాన్యులకు కనీసం పాలు కూడా లభించకుండా కేంద్రం కుట్ర చేస్తున్నదని దుయ్యబట్టారు. వెంటనే జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, నాయకులు పాల్గొన్నారు. అలాగే బోథ్ మండల కేంద్రంలో మండల కన్వీనర్ రుక్మణ్‌సింగ్ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కడుపు కొట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదన్నారు. పసిపిల్లలు తాగే పాలపై జీఎస్టీ విధించడం విడ్డూరమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆవుల భోజన్న, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు తాహెర్ బిన్సలాం, సర్పంచ్ సురేందర్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు.