బేల, జూలై 18 : మండలంలోని డోప్టాల పీఏసీఎస్ సీఈవోగా ఖోడే ప్రశాంత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డోప్టాల పీఏసీఎస్ చైర్మన్ వైద్య జితేందర్ నేతృత్వంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో సీఈవోగా పని చేసిన ఓల్లఫర్ సంజయ్ రైతులకు సంబంధించిన రుణాల్లో అక్రమాలు చేశారనే ఆరోపణలు రావడంతో అనుబంధ బేల మండల కోపరేటివ్ బ్యాంకు మేనేజర్ ఆరా తీశారు. సదరు ఆధికారి పర్యవేక్షణలో రూ. 12 లక్షలకు పైగా అక్రమాలు బయటపడ్డాయి. విషయాన్ని సదరు మేనేజర్ ఉన్నతాధికారులకు తెలియజేయడంతో ఆయనపై సస్పెషన్ వేటు పడింది. దీంతో ఆయన కాజేసిన అక్రమ సొమ్మంతా తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేశారు. రాజకీయ నాయకుల అండదండతో మళ్లీ విధుల్లోకి తీసుకోగా ఈ సారి కూడా భారీ కుంభకోణం చేసినట్లు ఆరోపణలు రావడంతో జిల్లా కోఆపరేటివ్ ఆధికారులు రంగంలోకి దిగారు. విచారణలో రూ. 9,60,179 సభ్యుల నుంచి వసూలు చేసి సంఘం ఖాతాలో జమ చేయలేదని తేలింది. దీంతో ఆయనను సీఈవో పదివి నుంచి సస్పెండ్ చేశారు. దీంతో అదే శాఖలో పని చేస్తున్న ఖోడే ప్రశాంత్‌కు సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. సీఈవో ఖోడే ప్రశాంత్‌ను రైతులు, అధికారులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో రైతులు ఠాక్రే అనిల్, ఉమేశ్, వినోద్, పీఏసీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.