ఎదులాపురం, జూలై 17 : జల్సాలకు అలవాటు పడి, స్నేహితుడినే వంచించారు. బైక్ కోసం నమ్మించి హత్యచేశారు. ఆపై మృతదేహాన్ని నీటిలో పడేశారు. ఈ హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ టూటౌన్లో ఆదివారం డీఎస్పీ ఉమేందర్ విలేకరులకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్‌కు చెందిన బైక్ మెకానిక్ కాశీఫ్ బేగ్(17), వడ్డెర కాలనీకి చెందిన షేక్ బిలాల్ అహ్మద్, మరో మైనర్ బాలుడు స్నేహితులు. ఈ ముగ్గురు జల్సాలకు అలవాటుపడ్డారు. ఈ క్రమంలో కాశీఫ్ బేగ్ వద్ద ఉన్న బైక్‌ను తాకట్టు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6వ తేదీన తనను నమ్మించిన ఇద్దరు మిత్రులు మహారాష్ట్రలోని కిన్వట్‌కు తీసుకెళ్లారు.
తర్వాత డబ్బులు ఇచ్చే వ్యక్తి ఫోన్ సిచ్ఛాఫ్ వస్తున్నదని నమ్మించారు. తిరిగి ఆదిలాబాద్ బయల్దేరారు. అప్పటికే రాత్రి 11 కావడంతో, వడ్డాడి ప్రాజెక్టు వద్ద స్టాఫ్రూంలో ఉందామని నిర్ణయించుకున్నారు. అదునుకోసం చూస్తున్న ఈ ఇద్దరూ మీర్జాను గొంతునులిమి హత్యచేశారు. మృతదేహాన్ని ప్రాజెక్టులో పడేశారు. ఆ తర్వాత అదే రాత్రి వారు కిన్వట్ వెళ్లి, రైల్వేస్టేషన్లో పడుకున్నారు. తెల్లవారుజామున ఓ వ్యక్తి వద్ద బైకు తాకట్టుపెట్టి, రూ.15వేలు తీసుకున్నారు. మధ్యాహ్నం రైలులో ఆదిలాబాద్ వచ్చారు. 7వ తేదీన ప్రాజెక్టులో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. అదే రోజు కాశీఫ్ బేగ్ కనిపించడంలేదని తండ్రి మీర్జా షబానా బేగ్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సమాచారంతో మత్తడిలో లభ్యమైన మృతదేహం కాషీఫ్దేనని పోలీసులు నిర్దారించుకున్నారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, ఇద్దరు మిత్రులతో తిరిగినట్లు తెలుసుకున్నారు. మృతుడి ఫోన్ కాల్స్ ఆధారంగా షేక్ బిలాల్ అహ్మద్, మరో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తమ విధానం విచారించగా, జల్సాలకు అలవాటుపడి బైక్ కోసం హత్యచేసినట్లు ఒప్పుకున్నారు.
పోలీస్ స్టేషన్ నుంచి పరార్..
నిందితులను 9వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకోగా, విచారణ నిమిత్తం స్టేషన్లో ఉంచారు. 14న రాత్రి టూ టౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. స్థానికంగా ఓ హిజ్రాతో సంబంధం ఉన్నదని తెలుసుకొని 15న స్టేషన్‌కు రప్పించారు. అదే సమయంలో నిందితుడి నుంచి డబ్బులు అవసరం ఉన్నదని ఈమేకు ఫోన్ రావడంతో లొకేషన్ ట్రేస్ చేశారు. కామారెడ్డిలో ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఎస్పీని డీ ఉదయ్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా, జరిగిన సంఘటన వాస్తవమేనని తెలిపారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.