నిర్మల్, జూలై 17(నమస్తే తెలంగాణ) : గొర్రె పిల్లల్లో వచ్చే నీలి నాలుక (బ్లూటంగ్) వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. నిర్మల్ జిల్లాలో ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు వ్యాక్సిన్ వేసేందుకు పశుసంవర్ధక శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 1.50లక్షల గొర్రె పిల్లలకు టీకాలు వేయనున్నారు. బాసర మండలంలో 5,510 గొర్రె పిల్లలు, భైంసాలో 9,303, దస్తూరాబాద్లో 3,714, దిలావర్పూర్లో 8,357, కడెంలో 12,341, ఖానాపూర్‌లో 8,527, కుభీర్‌లో 5,223, కుంటాలలో 4,416, లక్ష్మణచాందలో 10,100, లోకేశ్వరంలో 23,166, మామడలో 10,099 గొర్రె పిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ముథోల్‌లో 9,170, నర్సాపూర్(జీ)లో 5,277, నిర్మల్ మండలంలో 10,086, నిర్మల్ అర్బన్‌లో 777, పెంబిలో 2,159, సారంగాపూర్‌లో 9,767, సోన్‌లో 6,977, తానూర్ మండలంలో 4,427 గొర్రె పిల్లలు ఉండగా, వీటన్నింటికి వ్యాక్సిన్ వేయనున్నారు.
గొర్రె పిల్లలకే ఈ వ్యాధి…
నీలి నాలుక వ్యాధి కేవలం గొర్రె పిల్లలకే వస్తుంది. ఇది సోకిన పిల్లల్లో 106 నుంచి 108 డిగ్రీల వరకు జ్వరం ఉంటుంది. పెదవులు ఎర్రబడడం, నాలుక వాపు రావడంతో పాటు రంగు మారుతుంది. అలాగే నోటిలో కురుపులు, సొల్లు కారడం, మేత తినకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధితో గిట్టల మధ్య ఎర్రబడి సరిగ్గా నడవలేవని తెలుపుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి 5 నుంచి 6 రోజుల వరకు మేత మేయక, నీరు తాగక నీరసించి చనిపోతాయి. ఈ వ్యాధిబారిన పడిన గొర్రె పిల్లలకు రోజూ తైద, మక్కల అంబలి తాగిస్తుండాలి. నోటిలోని పుండ్లను పొటాషియం ద్రావణంతో కడిగి బోరిక్ పౌడర్‌ను నోటిలో రుద్దాలి. గిట్టల మధ్య ఉన్న పుండ్లను కడిగి, హిమాక్స్, లోరాజెన్ వంటి లోషన్‌ను రాయాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు.
సిద్ధంగా 2 లక్షల డోసులు..
గొర్రె పిల్లలకు పంపిణీ చేసేందుకు అవసరమైన 2 లక్షల డోసుల టీకాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసి, వీటిని కొనుగోలు చేశారు. అన్ని మండలాల్లో గ్రామాల వారీగా గొర్రె పిల్లలకు పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 29 బృందాల ద్వారా టీకాలు వేసే కార్యక్రమం 18 నుంచి 28వ తేదీ వరకు కొనసాగనున్నది. ముందే నిర్ణయించిన తేదీల్లో ప్రత్యేక బృందాలు వచ్చి, టీకాలు వేయనున్నాయి. అయితే ఇప్పటి వరకు గొర్రెల పెంపకందారులే ఈ టీకాలను సొంతంగా కొనుగోలు చేసి, వేయించేవారు. ఈ ఏడాది మొదటిసారిగా ప్రభుత్వమే ఉచితంగా వేయాలని నిర్ణయించడంతో జిల్లాలోని గొర్రెల పెంపకందారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు మాంసం ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం ఉచితంగా గొర్రె పిల్లలను పంపిణీ చేస్తూ జీవాల సంపద వృద్ధికి కృషి చేస్తున్నది.
18 నుంచి టీకాల పంపిణీ..
నిర్మల్ జిల్లాలో 18 నుంచి 28వ తేదీ వరకు గొర్రె పిల్లలకు నీలినాలుక (బ్లూటంగ్) వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేయనున్నాం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,52,000 గొర్రెలు ఉండగా, వాటిలో 1,50,000 గొర్రె పిల్లలు ఉన్నట్లు గుర్తించాం. వీటికి టీకాలు వేసేందుకు 2 లక్షల డోసులు సిద్ధంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 29 ప్రత్యేక బృందాలతో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేస్తాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ టీకాను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తున్నది.
– డాక్టర్ వై రమేశ్, పశుసంవర్ధక శాఖ అధికారి, నిర్మల్ జిల్లా