సారంగాపూర్, నవంబర్ 5 : ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రతిభ కలిగిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. అలాంటి వారికి అండ గా నిలిచేందుకు ప్రభుత్వాలు ఉపకార వేతనాలు అందిస్తున్నాయి. పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పథకాన్ని అమలు చేస్తూ ఉపకార వేతనం అందిస్తున్నది. పలు కారణాలతో అధిక శాతం విద్యార్థులు దరఖాస్తు చేయలేక పోతున్నారు. ఈ పథకం ప్రయోజనం ఎక్కువ మందికి చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి దరఖాస్తు గడువును ఈనెల 7 వరకు పొడిగించారు.
నాలుగేళ్లపాటు సాయం
ఏటా అర్హత పరీక్షలు నిర్వహిస్తూ ప్రతిభ గల విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ ద్వారా ఉపకార వేతనాలు ఇస్తున్నారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపాల్ శాఖ పరిధి పాఠశాలలతో పాటుగా వసతిగృహ సదుపాయం లేకుండా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. అర్హత పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులకు తొమ్మిది, పది తరగతులతో పాటు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం వరకు ఏడాదికి రూ.12వేల చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తున్నారు. 2022-2023 ఏడాదికి ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. గత నెల 28 వరకే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండగా, ధ్రువపత్రాల జారీలో ఆలస్యం, సాంకేతిక కారణాలతో చాలా మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోలేదని గుర్తించిన విద్యాశాఖ అధికారులు గడువును ఈ నెల 7 వరకు పొడిగించారు. రెండు రోజులు మాత్రమే సమయం ఉంది.
దరఖాస్తు విధానం
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు దివ్యాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్రప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని నింపాలి. రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో పాటు ఆధార్ కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, పాఠశాల నుంచి బోనపైడ్ పత్రాలు జత చేయాలి. బీసీ, ఓసీ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ. 100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పరీక్ష రుసుము రూ. 50 ఎస్బీఐ బ్యాంక్లో డీడీ తీయాలి. ఆయా పాఠశాలల హెచ్ఎంల ద్వారా ఈనెల 29 వరకు దరఖాస్తులను జిల్లా విద్యాధికార్యాలయానికి పంపాలి.
వీరు అనర్హులు
నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అనర్హులు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.
సద్వినియోగం చేసుకోవాలి…
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలోని ఉన్నత పాఠశాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు దరఖా స్తు చేసుకోవాలి. అర్హత పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఏడాదికి రూ.12వేలు ప్రభుత్వం అందిస్తుంది. పేద విద్యార్థులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది.
రవీందర్రెడ్డి, నిర్మల్ డీఈవో