ఆదిలాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వారం రోజులుగా భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన నష్టం నివేదికలను వెంటనే అందజేయాలని అధికారులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో వరద నష్టం, సహాయక చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్‌తో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో పరిస్థితిపై సీఎం కేసీఆర్‌కు నివేదిస్తామని, బాధితులందరికీ అండగా ఉండేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. విపత్తు వేళ అధికారులంతా అప్రమత్తంగా ఉండి సేవలందించడం అభినందనీయమని కొనియాడారు. పంట, ఆస్తినష్టంపై సర్వే చేపట్టాలని, ప్రాజెక్టులను ఎప్పటికప్పడూ పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లాలో వర్షం వల్ల ఏర్పడిన నష్టాన్ని ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్‌కు తెలియజేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అందుకు అధికారులు తమ శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాల నివేదికలు వెంటనే అందజేయాలని ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తెగిన వంతెనలకు మరమ్మతులు చేయాలని, విద్యుత్ సౌకర్యం నిలిచిపోయిన గ్రామాలకు సరఫరా పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. వరదల సమయంలో అధికారులు, సిబ్బంది చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
సాత్నాల, మత్తడి, చనాక-కోర్ట ప్రాజెక్టులను క్రమంగా పర్యవేక్షించాలని సూచించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు చేపట్టాలన్నారు. గిరిజన గ్రామాల్లో వరదతాకిడికి గురైన ప్రజలకు ఐటీడీఏ అధికారులు తగిన సాయం అందించాలని తెలిపారు. అనంతరం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, అధికారులు సరఫరాను వెంటనే పునరుద్ధరించాలన్నారు.
వరదల సమయంలో కలెక్టర్, జిల్లా యంత్రాగం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించారని పేర్కొన్నారు. బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని రైతులు భారీగా పంటలను నష్టపోయారన్నారు. ఇచ్చోడ వద్ద వంతెన తెగిపోవడంతో ముక్రా(కే) వద్ద నిర్మించిన కొత్త వంతెన ప్రజలకు ఎంతగానో ఉపయోగపడినట్లు తెలిపారు. కుప్టీ ప్రాజెక్టు నిర్మాణంతో కడెం జలాశయానికి వరద ఉధృతి తగ్గుతుందన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఐ పీవో వరుణ్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.