కోటపల్లి, జూలై 13 : వరదలతో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తానున్నానని, నిర్వాసితులను ఆదుకుంటానని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ భరోసానిచ్చారు. కోటపల్లి మండలంలోని లక్ష్మీపూర్‌లో ముంపు ప్రాంతాలను ఆయన బుధవారం పరిశీలించారు. వర్షాలు తగ్గాక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసిందని తెలిపారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలోని దేవులవాడ, బోరంపల్లి, కొల్లూరు గ్రామాలు వరద ముంపునకు గురయ్యే అవకాశాలు ఉండగా పారుపల్లి, కొల్లూరు గ్రామాలకు వారిని తరలించి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను విప్ సందర్శించారు. ఆయన వెంట జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్ఐ వెంకట్, వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావ్, పీఏసీఎస్ చైర్మన్ సాంబాగౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుర్రం రాజన్న, సర్పంచ్‌లు పానెం శంకర్, బైరి రాజాగౌడ్, ఆకుదారి రమేశ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎరినాగుల ఓదెలు, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు మారిశెట్టి విద్యాసాగర్, మండల నాయకులు గాదె శ్రీనివాస్, నర్సింహులు, శ్రీశైలం, దుర్గం కృష్ణదాస్, ఆసంపల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
టేకుమట్ల వాగుపై బ్రిడ్జి నిర్మిస్తాం..జైపూర్, జూలై 13: జైపూర్ మండలంలోని టేకుమట్ల వద్ద లోలెవల్ వంతెనపై రూ.8 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందని ప్రభుత్వవిప్ బాల్క సుమన్ తెలిపారు. ఉధృతంగా ప్రవహిస్తున్న టేకుమట్లవాగు, రసూల్‌పల్లి వాగులను ఆయన పరిశీలించారు. వర్షాలు తగ్గు ముఖం పట్టగానే టేకుమట్ల వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు. అనంతరం రసూల్‌పల్లి వాగు వద్ద ఎన్‌హెచ్ 63పై నిర్మిస్తున్న వంతెన ప్రదేశంలో తాత్కాలిక వంతెన కోతకు గురైంది. కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్ సీఐ రాజు, వైస్ ఎంపీపీ పెద్దపల్లి రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ గుండు తిరుపతి, కో ఆప్షన్ జైనుద్దీన్, సర్పంచ్ గోనే సుమలత, ఎంపీటీసీ బడుగు రవి, ఉప సర్పంచ్ లక్ష్మీనర్సయ్య తదితరులున్నారు.
చెన్నూర్‌లో ముంపు ప్రాంతాల పరిశీలన
చెన్నూర్, జూలై 13: చెన్నూర్ పట్టణ శివారులో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో విప్ బాల్క సుమన్ పర్యటించారు. లోతట్టు ప్రాంతాలను, నీట మునిగిన పంటలను పరిశీలించారు. దెబ్బతిన్న పంటలపై సర్వే చేయిస్తానని చెప్పారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, పోగుల సతీశ్, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, అరీఫ్, మహేందర్, నాయిని సతీశ్ ఉన్నారు.
వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి
చెన్నూర్, జూలై 13: వరదలపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశించారు. చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరదలపై బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులకు ఎగువ నుంచి వస్తున్న వరద గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల వరద ప్రభావిత గ్రామాలు, పునరావస కేంద్రాల ఏర్పాటు, వసతులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కలెక్టర్, ఇరిగేషన్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో మాట్లాడి వరద పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, పోలీసు అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులున్నారు.