ఎదులాపురం,జూలై13ః భారీ వర్షాల కారణంగా జిల్లా,మండల స్థాయి అధికారులు స్థానికంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వర్షాభావ పరిస్ధితులను అంచనా వేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లతో బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు సహాయక చర్యలు, పునరావాస కేంద్రాల వంటి అంశాలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
లోతట్టు కాలనీల ప్రజల కోసం పట్టణంలోని రిమ్స్ ఆవరణలో , తాంసిబస్టాండ్ సమీపంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు 8 మండలాల్లోని తొమ్మిది గ్రామాల్లో 1265 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. 33 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, శిథిలావస్థలో ఉన్న మూడు ఇండ్లు పూర్తిగా కులిపోయాయన్నారు. 18 రోడ్లు వరదలకు దెబ్బతిన్నాయని తెలిపారు. వరద బాధితులు తక్షణ సహాయం కోసం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నంబర్ 1800- 425 -1939ను సంప్రదించాలన్నారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీపీవో శ్రీనివాస్, డీఈవో ప్రణీత, ట్రాన్స్కో ఎస్ఈ ఉత్తమ్ జాడే, మున్సిపల్ కమిషనర్ శైలజ, తహసీల్దార్లు ఉన్నారు.