బజార్హత్నూర్, జూలై 9 : వానకాలంలో ఆరోగ్య విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్‌తో పాటు సీజనల్ వ్యాధులతో ముప్పు పొంచి ఉంది. గ్రామాల్లో పరిసరాల శుభ్రత, దోమల నివారణతో డెంగీ, మలేరియా ప్రబలకుండా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు .
దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పనికిరాని పాత్రలు, టైర్లు, పగిలిపోయిన బకెట్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఓవర్‌హెడ్ ట్యాంకులు, పంపులు, డ్రమ్ములు నీటితొట్టిలపై మూతపెట్టాలి. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి నీటి నిల్వలు తొలగించి ఆరబెట్టి తిరిగి నింపుకోవాలి. ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ సంచులు, కప్పులు, గ్లాసులు మురుగు కాలువల్లో వేయకూడదు. ఇంటి, కిటికిలు, గుమ్మాలకు జాలిమెస్ అమర్చాలి. దోమతెరలు వాడడం అలవాటు చేసుకోవాలి.
డెంగీ లక్షణాలు
జ్వరం రావడంతో పాటు తలనొప్పి అధికమవుతుంది. కంటి కదలికల సమయంలో భరించలేని నొప్పి ఉంటుంది. కీళ్లనొప్పులు, శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. ఆకలి పూర్తిగా తగ్గిపోవడం, ముక్కు నుంచి రక్తస్రావం, మలవిసర్జన నల్లగా ఉంటుంది.
మలేరియా లక్షణాలు
జ్వరం రావడంతో పాటు చలివణుకు ఉంటుంది. నీరసంగా అనిపించడం, రక్తహీనత పెరిగే అవకాశం, తలనొప్పితో మలేరియా మెదడుకు సోకవచ్చు.
నివారణ చర్యలు
జ్వరం లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్య పరీక్ష చేయించుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకొని తాగాలి. విశ్రాంతి తీసుకోవాలి. రాత్రిపూట నిద్రపోవాలి. బొప్పాయి ఆకురసం తాగితే ప్లేట్లెట్స్ పెరిగి డెంగీ తగ్గే అవకాశముంది.
సమాజపరంగా జాగ్రత్తలు
గ్రామాల్లోని వీధులు శుభ్రంగా ఉంచి మురుగు కాలువల్లో చెత్తాచెదారం తొలగించాలి. వర్షాలకు ముందు తర్వాత మురుగు కాలువలో పూడికతీత చేపట్టాలి. గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలి.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
జ్వరం రాగానే ఆందోళన చెందకుండా డాక్టర్లను సంప్రదించాలి. వారి సలహాలు సూచనలు పాటించాలి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. దోమతెరలు వాడాలి. రోగనిరోధకశక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవాలి.
-బజార్హత్నూర్ వైద్యాధికారి సురేశ్