బాసర, జూలై 8 : బాసర ట్రిపుల్ ఐటీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకోసం ఇప్పటికే డైరెక్టర్‌ను నియమించిన సర్కారు, సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఓ వైపు విద్యాప్రమాణాలు పెంచుతూనే, ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. దీంతో పాటు ప్రాంగణంలో ఒక మహిళ ఎస్ఐతో పాటు నలుగురు పీఈటీలను నియమించేందుకు నిర్ణయించింది. విద్యార్థులకు ఇప్పటికే 24 గంటల ఈ లైబ్రరీ అందుబాటులోకి తేగా, అన్ని వసతులతో మెస్‌ను ఇటీవల ప్రారంభించింది.
బాసర ట్రిపుల్ఐటీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన వారిద్దరూ ట్రిపుల్‌ఐటీలో సమస్యలను పర్యవేక్షిస్తూ, అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంగళవారం కొత్త మెస్తో పాటు డిజిటల్ లైబ్రరీని అప్‌గ్రేడ్ చేశారు.
విద్యాప్రమాణాల పెంపునకు..
ట్రిపుల్‌ఐటీలో చదివే 8వేల మంది విద్యార్థులకు ఐసీటీ తరహాలో విద్యాబోధన అందించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. 24 గంటల లైబ్రరీతో పాటు ప్రత్యేకంగా విద్యార్థులకు స్టడీ అవర్స్ పెట్టి కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంచేందుకు వీలుగా పలు యూనివర్సీటీల ప్రొఫెసర్లతో పలు సమావేశాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఇందుకు గాను ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో సమావేశాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. లైబ్రరీలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది.
త్వరలో నాన్ టీచింగ్ ఉద్యోగుల భర్తీ..
ట్రిపుల్‌ఐటీలో ఖాళీగా ఉన్న నాన్‌టీచింగ్ ఉద్యోగులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వార్డెన్లు, కేర్ టేకర్లు, సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్, తదితర సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు.
నాలుగు పీఈటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీలో చదువుతున్న విద్యార్థులందరికీ కలిపి ఒక్కరే పీడీ ఉన్నారు. దీంతో ప్రభుత్వం గత నెల 23న నలుగురు పీఈటీల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో ముగ్గురు మహిళా పీఈటీలను నియమించనుంది. ప్రత్యేకంగా అనుభవం ఉన్న వారిని మాత్రమే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.
త్వరలోనే యూనిఫామ్‌లు, షూస్‌లు..
కరోనా నేపథ్యంలో మూడేళ్ల నుంచి విద్యార్థులకు యూనిఫామ్‌లు ఇవ్వలేదు. కాగా, ఈ విద్యాసంవత్సరం నుంచి అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థినీవిద్యార్థులకు యూనిఫామ్లతో పాటు షూస్‌లను త్వరలోనే అందించాలని భావిస్తున్నది. దీంతో పాటుగా ఇప్పటికే కొందరికి ల్యాప్‌టాప్‌లను అందజేసింది.
అమల్లోకి బయోమెట్రిక్ విధానం. . .
ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులకు ఇకపై బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు వేయనున్నారు. దీంతో విద్యార్థులు తప్పనిసరిగా క్లాసులకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు మెస్‌లో కూడా ఎందరు విద్యార్థులు భోజనం చేస్తున్నారో తెలుసుకునేందుకు వీలుగా అక్కడ కూడా బయోమెట్రిక్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
వారం రోజుల్లోనే మహిళా ఎస్ఐ నియామకం
ట్రిపుల్ ఐటీలో మొత్తం 4వేలకు పైగా విద్యార్థినులు చదువుతున్నారు. ఇప్పటివరకు డీఎస్పీ, సీఐలు అక్కడ విధుల్లో ఉండగా, బాలికల కోసం ప్రత్యేకంగా మహిళా ఎస్ఐని వారం రోజుల్లో నియమిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
త్వరలో హరితహారం
280 ఎకరాల విస్తీర్ణం ఉన్న బాసర ట్రిపుల్‌ఐటీలో తరగతి గదుల భవనాలు ఉన్నాయి. ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా 25వేల మొక్కలు నాటేందుకు పనులు కొనసాగుతున్నాయి. దీంతో పాటుగా సిబ్బంది కోసం నిర్మిస్తున్న క్వార్టర్స్ పెండింగ్‌లో ఉండగా, త్వరలోనే పూర్తి చేయనున్నారు.