ఉట్నూర్, జూలై 8 : యువత ఉపాధి రంగాలపై దృష్టి పెట్టాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఉట్నూర్‌లో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శుక్రవారం జాబ్‌మేళా ఏర్పాటు చేయగా, పీవో వరుణ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. 30 కంపెనీలు ఇందులో పాల్గొనగా, 450 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఐటీడీఏ ద్వారా కృషి చేస్తామని పీవో స్పష్టం చేశారు.
యువత ఉపాధి రంగాలపై దృష్టి సారించాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు. ఉట్నూర్‌లోని కుమ్రం భీం కాంప్లెక్స్‌లోని వైటీసీ కేంద్రంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ గిరిజన యువతీ, యువకులకు ఉద్యోగం కల్పించడానికి జాబ్‌మేళాలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ జాబ్‌మేళాకు 900 మంది యువతీ, యువకులు హాజరు కాగా 30 కంపెనీలు పాల్గొని 450 మందిని ఎంపిక చేసుకున్నాయన్నారు. రానున్న రోజుల్లో మరిన్నీ జాబ్‌మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. యువతకు అర్హతను బట్టి ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్, ఏపీవో భాస్కర్, యూత్ ట్రైనింగ్ సెంటర్ జేడీఎం నాగభూషణం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాపారాల్లో రాణించాలి
యువత వ్యాపార రంగాల్లో రాణించాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్ అన్నారు. మండల కేంద్రంలోని శివాజీచౌక్‌లో ఏర్పాటు చేసిన ఫొటో స్టూడియోను ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు జాదవ్ సుమన్‌బాయి, తదితరులు పాల్గొన్నారు.
అనుకున్న జీతం లభించింది
మాది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం. ఉట్నూర్‌లో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళా గురించి తెలుసుకొని వచ్చాను. హెల్త్ డిపార్ట్మెంట్లో రూ.30వేల జీతం దొరికింది. ఈ అవకాశం ఇచ్చిన ఐటీడీఏ పీవో, అధికారులకు రుణపడి ఉంటా. –హంసబాయి, తిర్యాణి,కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా