తాండూర్, జూన్ 20:అడవుల రక్షణ.., కాలుష్యం నివారణ.., పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. వరుసగా ఏడు విడుతలు విజయవంతమవగా, ఎనిమిదోవిడుతకు మొక్కలను రెడీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 19.50 కోట్లు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. రుతుపవనాల రాకే సరైన సమయమని భావించిన సర్కారు.., అందుకు తగ్గట్టుగా త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా జిల్లాలోని అటవీ శాఖ, ఉపాధి హామీ నర్సరీల్లో లక్షలాది మొక్కలతో అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నది.
ఎనిమిదో విడుత హరితహారానికి ఉపాధి హామీ, అటవీ శాఖ నర్సరీల్లో లక్షలాది మొక్కలను సిద్ధం చేశారు. అన్ని గ్రామాల్లో నాటేలా అధికారులు సన్నద్ధమవుతున్నారు. హరితహారంలో అగ్రస్థానం అటవీ శాఖ నర్సరీలదే. ఇందులో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో తాండూర్ మండలం నీలాయపల్లి సెక్షన్ పరిధి రేపల్లెవాడ సమీపంలోని నర్సరీలో 3 లక్షల మొక్కలను సిద్ధం చేశారు. ఉపాధి హామీ కూలీలతో జిట్రేగి, నారేప, నెమలినార, సోమే, చిందుగ, అందుగ, తీర్మా న్, వేప, జామ, సీతాఫల్, దానిమ్మ, నిమ్మ, జీడి మామిడి, బూరుగ, వెదురు, ఉసిరి, తబ్సి, వెగిస, సిస్సు, రాగి, మర్రి, అల్లనేరేడు, గుల్మోర్, జెల్టోఫామ్, పాలవరేని, టేకు, పండ్ల ర కాలు, పూల రకాల మొక్కలను అందుబాటులో ఉంచుతున్నామని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జే తిరుపతి పేర్కొన్నారు. ప్లాంటింగ్కు వీటిని అందిస్తామన్నారు. ఇక్కడ నర్సరీ ఏర్పా టు చేసినప్పటి నుంచి ఆరేండ్లుగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచి, హరితహారానికి అందిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్నారు. ఎనిమిదో విడుతకు తాండూర్ సెక్షన్ పరిధిలోని బుగ్గ, పెగడపల్లి, రాల్లపేట్ గ్రామాలతో పాటు, భీమిని మండలంలోని, బెల్లంపల్లి అటవీ శాఖ పరిధిలోని వివిధ ప్లాంటేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమానికి వీటిని అందిస్తామని వెల్లడించారు. అలాగే మొక్కలు సరిపోని గ్రామపంచాయతీలకు కూడా అటవీ శాఖ నర్సరీ నుంచి అందజేస్తామని పేర్కొన్నారు. మొక్కల పెంపకం, ప్లాంటేషన్లలో నాటే పనుల వల్ల మండలంలోని వివిధ గ్రామాల వారికి ఉపాధి దొరుకుతున్నది.
15 జీపీలు.. 15 నర్సరీలు..
ఉపాధి హమీ ద్వారా మండలంలోని 15 గ్రామ పంచాయతీల పరిధిలో 15 నర్సరీలు ఏర్పాటుచేసి మొక్కలను పెంచుతున్నారు. ఎనిమిదో విడుత కార్యక్రమం లక్ష్యం విజయవంతం చేస్తామని ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, డిఫ్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతి తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకరించాలని కోరారు. నర్సరీల్లో పెంచిన మొక్కలు, వాటి వివరాలను కలెక్టర్ భారతీ హోళికేరి, జిల్లా పంచాయతీ అధికారి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అటవీ శాఖ ప్లాంటేషన్లు, రహదారుల వెంట మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచేందుకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. మొత్తానికి మండలంలో పండుగలా కొనసాగే హరితహారానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.
85 శాతం మొక్కలు బతకాలి..
పంచాయతీ రాజ్ నూతన చట్టం ప్రకారం హరితహారంలో భాగంగా గ్రామాల్లో నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతకాలి. వాటిని సంరక్షించే బాధ్యతను ప్రభుత్వం సర్పంచ్, కార్యదర్శులకు అప్పగించింది. మొక్కలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలి. నిర్లక్ష్యం చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకునేలా చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణకే హరిత హారం..
పర్యావరణాన్ని కాపాడుకునేందుకు, బహుళ ప్రయోజనాలు కలిగేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపడుతున్నది. వనమహోత్సవానికి మండలంలోని అటవీ శాఖ, ఉపాధి హామీ నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని అన్ని గ్రామాల్లో నాటి, లక్ష్యానికి చేరుకుంటాం. హరితహారంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని, విజయవంతం చేయాలి. ఇది ఓ పచ్చని పండుగలా జరుపుకుందాం.
– పూసాల ప్రణయ్‌కుమార్, ఎంపీపీ, తాండూర్
అందరూ భాగస్వాములవ్వాలి..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. హరితహారంలో మొక్కలను నాటేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్న తరుణంలో మొక్కల పెంపకంపై మేము దృష్టి పెట్టాం. అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అన్ని గ్రామాల్లో మొక్కలు నాటి, లక్ష్యాన్ని చేరుకొని విజయవంతం చేస్తాం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అందరం పాల్గొంటాం.
– సాలిగామ బానయ్య, జడ్పీటీసీ, తాండూర్
సంపూర్ణంగా మొక్కలు అందిస్తాం..
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మా అటవీ శాఖ నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశాం. సంపూర్ణంగా హరితహారానికి అందిస్తాం. తాండూర్, భీమిని, బెల్లంపల్లి అటవీ సెక్షన్లు, మండలంలోని అవసరమైన పంచాయతీల వారీగా, అటవీ క్షేత్రంలో ప్లాంటేషన్లలో నాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. మా నర్సరీల్లో 3 లక్షల మొక్కలు సిద్ధం చేశాం. రైతులు టేకు మొక్కలు పెంచుకునేందుకు ఆసక్తి చూపాలి.
– జే తిరుపతి, డీఆర్వో, తాండూర్