కడెం, జూన్ 19 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రధాన ప్రాజెక్టు అయిన కడెం జలాశయం.. కడెం మండలంతోపాటు, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మంచిర్యాల మండలాల రైతుల వరప్రదాయిని. కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయా మండలాల పరిధిలో 65 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రధాన కాలువ చివరి ఆయకట్టు మంచిర్యాల మండలం వరకు ఉంది. దీని పరిధిలో మొత్తం 42 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. పంటలకు సాఫీగా నీరందించేందుకు అధికారులు దగ్గరుండి జలాశయం వద్ద మరమ్మతులు చేయించారు. కాలం చెల్లిన రోప్‌లను తీసి.. కొత్తవి అమర్చారు. వరదగేట్ల ద్వారా దిగువకు నీరు వదిలే యంత్రాలకు గ్రీసింగ్ పనులు, ప్రధాన గేట్లకు రంగులువంటివి చేపట్టారు. సాంకేతిక పరమైన పనులన్నీ పూర్తి చేయించారు. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 675.950(2.906టీఎంసీల) అడుడుల వరకు నీరు ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 89క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. యేటా జూన్ నెలాఖరుకల్లా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది.
కిందిభాగంలో రక్షణ చర్యలు
జిల్లాలోని ప్రాజెక్టుల్లో మొదట నిండే ప్రాజెక్టు ఇదే. ఎగువ ప్రాంతాల్లోని సహ్యాద్రి కొండల నుంచి భారీగా వరద వచ్చి చేరి త్వరగా నిండుతుంది. కుంటాల, కుప్టి ప్రాంతాలతోపాటు గుడిహత్నూర్, నేరడిగొండ, బజార్హత్నూర్, బోథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, ఉట్నూర్ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుకుంటుంది. యేటా అనుకున్నదానికంటే వరద ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ప్రాజెక్టు మొత్తం గేట్లు 18 కూడా ఎత్తాల్సిన పరిస్థితి ఉంటుంది. వరద ప్రవాహానికి గేట్లకు ఇబ్బంది కలగకుండా భారీ క్రేన్ ద్వారా బ్లేడ్ట్రాక్టర్లను కిందికి దింపి మట్టి నింపారు.
కుడి కాలువకు మరమ్మతులు
ప్రాజెక్టు నుంచి 20 మీటర్ల వరకు కుడి కాలువ వెడల్పు పనులు చేపడుతున్నారు. కొండుకూర్ ప్రాంతంలో గండి పడిన చోట కూడా మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కాలువ ద్వారా కన్నాపూర్, కొండుకూర్, పెద్దబెల్లాల్, చిన్నబెల్లాల్, చిట్యాల గ్రామాల రైతాంగానికి సాగునీరు అందుతుంది. ప్రస్తుతం ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆయకట్టు నిండేలోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు గుత్తేదారులను ఆదేశించారు.
సాగునీరందించేందుకు సిద్ధం
వర్షాకాలంలో కడెం ప్రాజెక్టు త్వరగా నిండుతుంది. అందుకే ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేశాం. అధికారుల పర్యవేక్షణలో వేగంగా పనులు చేపట్టాం. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఇన్‌ఫ్లోను స్పష్టంగా తెలుసుకునేందుకు కంట్రోల్ రూంలో నూతన రోప్‌లను అమర్చాం. ప్రస్తుత వానకాలం పంటలకు నీరందంచేందుకు కడెం ప్రాజెక్టు సిద్ధంగా ఉంది.
– రాజశేఖర్, కడెం ప్రాజెక్టు ఈఈ