నార్నూర్,జూన్19: మండలంలో తాడిహత్నూర్,మహాగావ్లోని కల్వర్టులపై నిర్మిస్తున్న వంతెనలతో ప్రజలకు వరద కష్టాలు తీరునున్నాయి. నార్నూర్-గాదిగూడ మండల కేంద్రానికి ఈ కల్వర్టుల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. వాగుపై ఉన్న పురాతన లోతట్టు కల్వర్టులపై నుంచి వర్షాకాలంలో వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలుస్తున్నాయి. దీంతో వర్షాకాలంలో రాకపోకలు సాగించేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద కష్టాలు తీర్చాలని గత పాలకుల దృష్టికి ఎన్నోమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. గతపాలకుల హామీలు మాటాలకే పరిమితమాయ్యయి. గత ఏడాది ఆగష్టులో వర్షాలతో కల్వర్టులపై వరద ప్రవహించింది. ఆ సమయంలో ఆదిలాబాద్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ చొరవతో ఉమ్మడి మండలంలోని తాడిహత్నూర్,మాహగావ్,ఝరి కల్వర్టులపై వంతెనల నిర్మాణానికి రూ.7కోట్లు మంజూరయ్యాయి. ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు.
శరవేగంగా సాగుతున్న పనులు
రెండు మండలాలను కలిపే వంతెనల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. భారీ వర్షాలకు వరద ప్రవాహంతో ఇబ్బంది పడిన ప్రయాణికులు, ఆయా గ్రామాల ప్రజల కళ్లముందే నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాగావ్ వంతెన నిర్మాణం పూర్తయింది. తాడిహత్నూర్‌లో బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఝరిలో పనులు ప్రారంభించాల్సి ఉంది.
బాధిత కుటుంబానికి పరామర్శ
ఉట్నూర్ మండలం లక్కారం గ్రామ పంచాయతీ పరిధి కేబీ నగర్‌కు చెందిన ఐటీడీఏ ఉద్యోగి జల్పత్ నాయక్ కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. బాదిత కుటుంబాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఆదివారం పరామర్శించి, సానుభూతి తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీ సలీం, అనిల్ రాథోడ్, చౌహాన్ ప్రకాశ్, జాదవ్ రవి తదితరులు ఉన్నారు.
ఇబ్బందులు తీరుతాయి
వానకాలంలో వాగునీరు కల్వర్టుపై నుంచి ప్రవహిస్తుండడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ప్రజలకు వానకాలంలో వరద తిప్పలు తప్పనున్నాయి. అధికారులు కూడా వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలి.
-రాథోడ్ యశ్వంత్రావ్, సర్పంచ్ మహాగావ్
రాకపోకలు సాఫీగా…
బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ప్రయాణికుల బాధలు తీరుతాయి. నార్నూర్,గాదిగూడ మండల ప్రజల రాకపోకలు సాఫీగా సాగుతాయి. బ్రిడ్జి నిర్మాణం ఎత్తుగా నిర్మిస్తుండడంతో వరద వాగులోనే ప్రవహిస్తుంది. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు ఉండవు.
-గేడం ఏత్మాబాయి, ఎంపీటీసీ, గుండాల
సల్లంగ చూడమ్మా.. పోచమ్మ
పోచమ్మ తల్లీ.. సల్లంగ చూడమ్మా అంటూ మహిళలు అమ్మవార్లను వేడుకున్నారు. మండలంలోని కౌఠ (బీ) గ్రామంలో వీర హనుమాన్గల్లీ వాసులు పోచమ్మలకు ఆదివారం పూజలు పూజలు చేశారు. డప్పుచప్పుళ్లు, బోనాలతో ఊరేగింపుగా ఊర పోచమ్మ, మహాలక్ష్మీ పోచమ్మ, ముత్యాల పోచమ్మ ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.