ఆదిలాబాద్, జూన్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;పట్టణాలు, పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ముగిసింది. నాలుగు మున్సిపాలిటీలు, 864 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమం విజయవంతమైంది. పట్టణ ప్రగతి నాలుగో విడుత, పల్లె ప్రగతి ఐదో విడుత ఈ నెల 3వతేదీన ప్రారంభం కాగా శనివారం వరకు కొనసాగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక మున్సిపాలిటీతోపాటు 468 గ్రామ పంచాయతీలు, నిర్మల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, 396 గ్రామ పంచాయతీల్లో చేపట్టారు. రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, మథోల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, రేఖానాయక్, విఠల్‌రెడ్డి, ఆత్రం సక్కు.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా పరిషత్ చైర్మన్లు రాథోడ్ జనార్దన్, విజయలక్ష్మి, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులు పక్షం రోజులపాటు విస్తృతంగా పర్యటించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
పరిష్కారం కోసం అధికారులకు సూచనలు చేశారు. స్థానికులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని, అభివృద్ధికి సహకారం అందించారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం చివరి రోజైన శనివారం పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ రూరల్ మండలం న్యూపోచంపాడ్లో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఉట్నూర్ మండలం కన్నాపూర్‌లో అధికారులతో కలిసి శుక్రవారం రాత్రి పల్లెనిద్ర చేపట్టారు. ఉదయం గ్రామంలో తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లీలో మథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుధ్య సిబ్బందిని ప్రజాప్రతినిధులు, అధికారులు సన్మానించారు. పట్టణ, పల్లె ప్రగతి నిర్వహణతో పరిశుభ్రంగా మారడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించాయి.