ఉట్నూర్ రూరల్, జూన్ 18: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించామని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా శుక్రవారం రాత్రి ఉట్నూర్ మండలం కన్నాపూర్ గ్రామంలో అధికారులతో కలిసి పల్లెనిద్ర చేశారు. గ్రామానికి చేరుకున్న జడ్పీ చైర్మన్‌కు గ్రామస్తులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులతో ముచ్చటించారు. రాత్రి అక్కడే నిద్రించి శనివారం ఉదయం గ్రామంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి పర్యటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో జడ్పీచైర్మన్ మాట్లాడుతూ గ్రామానికి నూతన బ్రిడ్జి నిర్మాణం, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్, తాగునీటి సమస్యలు త్వరగా పరిష్కరిస్తామన్నారు. జడ్పీ నిధులతో తాగునీటి కోసం 10వేల లీటర్ల అదనపు నీటి ట్యాంకు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ అటవీ భూములు సాగు చేస్తున్న వారికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించుటకు చర్యలు తీసుకుంటామన్నారు. గిరివికాసం పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పెందూర్ జుగాదిరావు, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో నరేందర్, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే, డీఎల్పీవో భిక్షపతిగౌడ్, ఎంపీడీవో తిరుమలు, ఎంపీవో మహేశ్, ఏపీవో రజినీకాంత్, జీవ వైవిధ్య మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.