నిర్మల్ అర్బన్, జూన్ 18 : ప్రజల భాగస్వామ్యంతోనే పల్లె, పట్టణ ప్రగతి సక్సెస్ అయిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్‌లో శనివారం పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి వ్యవసాయ మార్కెట్ వరకు మంత్రి పాదయాత్ర నిర్వహించారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో 15 రోజుల పాటు నిర్వహించిన పట్టణ ప్రగతి ద్వారా ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూడలేకనే కేంద్రం నిధులను విడుదల చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నదని తెలిపారు. దేశంలో పది గ్రామ పంచాయతీలు తెలంగాణ నుంచే ఎంపిక అయ్యాయని గుర్తు చేశారు.
నిర్మల్‌లో రూ.42 కోట్లతో తాగునీటి కోసం ఐడు ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మించామన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందించామన్నారు. మరో 2500 డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇంటిని సాకారం చేయాలనే సకల్పంతో సీఎం కేసీఆర్ ఖాళీ స్థలం ఉన్న వారికి రూ. 3 లక్షలు అందించనున్నామని అన్నారు. నియోజక వర్గానికి ఏడాదికి 3000 మందికి ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ కమిషనర్ సంపత్, తహసీల్దార్ సుభాష్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ దర్మాజీ రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, నాయకులు మారుగొండ రాము, ముత్యం రెడ్డి, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, నాయకులు పోశెట్టి, శ్రీధర్ పాల్గొన్నారు.
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ వద్ద తెలంగాణ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ శివాజీ చౌక్, ఈద్గాం మీదుగా వశిష్ట డిగ్రీ కళాశాల వరకు చేరుకుంది. అనంతరం యోగా నిర్వాహకులు మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో ఆయుష్ నోడల్ ఆఫీసర్ గంగాదాస్, ఆయుష్ డాక్టర్లు సంధ్యారాణి, వెంకటేశ్వర్లు, వైద్యులు రమేశ్ రెడ్డి, కృష్ణం రాజు, వేణుగోపాల కృష్ణ, నాయకులు అల్లోల సురేందర్ రెడ్డి, కిషన్, పద్మనాభం, వశిష్ట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అఖిలేశ్ కుమార్, సరోత్తమ్‌రెడ్డి పాల్గొన్నారు.
బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ ప్రారంభం
నిర్మల్‌లోని పీజీ కళాశాలలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ స్టడీ సర్కిల్ సెంటర్‌ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసిన మంత్రికి ఉద్యోగార్థులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను మంత్రి విడుదల చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వర్‌గౌడ్, సహాయ అధికారి నాగారావు, స్టడీ సర్కిల్ నిర్వాహకులు ప్రవీణ్, డీఎస్పీ జీవన్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు రవి, ఖలీం, యోగేశ్, శారద, రాజేశ్వర్ పాల్గొన్నారు.
అగ్నిపథ్‌తో యువతను ఆగం చేసిన కేంద్రం
దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పేరుతో యువతను ఆగం పట్టించే ధోరణి అవలంబిస్తున్నదని, దేశంలో జరిగే విధ్వంసకాండకు కేంద్రమే బాధ్యత వహించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిర్మల్ మండలం న్యూపోచంపాడ్ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని వెంటనే అధికారం నుంచి తప్పుకోవాలని సూచించారు. వ్యవసాయ చట్టాలతో రైతులను ఆగం చేసిన కేంద్రం, ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో యువతకు నష్టం చేస్తున్నదని ఆరోపించారు. ఓ వైపు రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున పోలీసు ఉద్యోగాల నియమాకాలు చేస్తుంటే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చి దొడ్డిదారిన నియామకాలను చేపట్టేందుకు కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనకు టీఆర్ఎస్ కుట్రతో చేస్తున్నదని బీజేపీ నేతలు ఆరోపించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. బిహార్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ర్టాల్లో జరిగిన అల్లర్ల వెనుక అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటారా అని ప్రశ్నించారు. కేంద్రం ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం హింసలో గాయపడిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్రం నిధుల కొరతతో పాటు ఆంక్షలను విధిస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్ మండలం న్యూపోచంపాడ్ గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంతో పాటు సీసీ రోడ్లు, బృహత్ పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ భూమేశ్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, మండల ప్రత్యేకాధికారి మల్లికార్జున్, సారంగాపూర్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, డీపీవో శ్రీలత, పంచాయతీ రాజ్ ఈఈ శంకరయ్య, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రమేశ్‌కుమార్, ఆర్డీవో తుకారాం, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, నాయకులు ముత్యంరెడ్డి, పీ మహేశ్‌రెడ్డి, విలాస్, శ్రీనివాస్‌గౌడ్, కుంట పద్మకర్, సురపు సాయన్న, ధర్మారం పోశెట్టి పాల్గొన్నారు.