ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరుగా.. హుషారుగా కొనసాగుతున్నాయి. ఏడో రోజైన గురువారం మంత్రి అల్లోల, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని పొట్టపల్లి(కే)లో దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్.. భైంసా మున్సిపాలిటీ పరిధిలో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 24,25 వార్డుల్లో ఎమ్మెల్యే
దుర్గం చిన్నయ్య పాల్గొని, పనులను పరిశీలించారు. పలు సూచనలు చేశారు.
ఆదిలాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పట్టణాలు, పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఏడో రోజైన గురువారం జోరుగా కొనసాగింది. ఈ కార్యక్రమం నిర్వహణతో సందడి వాతావరణం నెలకొంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్రీడా ప్రాంగణాలు, ఇతర అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేస్తున్నారు. పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు మొక్కలు నాటుతున్నారు.
ప్లాస్టిక్ వాడకం ఆపివేయాలంటూ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి(కే)లో దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి హాజరయ్యారు. గ్రామ పంచాయతీ భవనం, క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. స్థానిక యువకులతో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడారు. ప్రభుత్వం క్రీడాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. యువకులు క్రీడా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. ఆదిలాబాద్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రంథాలయంలో మొక్కలు నాటి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
భైంసా మున్సిపాలిటీ పరిధిలో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పర్యటించారు. దేగాంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో అధికారులు, ప్రజా ప్రతినిధులు వార్డుల్లో తిరుగుతూ పలు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. బెల్లంపల్లి పట్టణంలోని 24, 25వ వార్డుల్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యటించారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్‌తో కలిసి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాలలోని 20,21,29 వార్డుల్లో చైర్మన్ పెంట రాజయ్య, కమిషనర్ బాలకృష్ణ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రదేశాలను డీపీవో నారాయణ, డీఆర్డీవో శేషాద్రి సందర్శించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం వంకులం గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి పరిశీలించారు.