రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12వ తేదీన నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి 49,616 మంది అభ్యర్థులు హాజరు కానుండగా, ఇందుకోసం 216 సెంటర్లను సిద్ధం చేశారు. కాగా అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తుండగా, ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నది. సందేహాలుంటే జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్లను సంప్రదించాలని వారు కోరుతున్నారు.
నిర్మల్ అర్బన్, జూన్ 9: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా టెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్ష కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1, పేపర్2లకు కలిపి 49,616 అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు ఆయా జిల్లాల అధికారులు ఏర్పాట్లను పూర్తి చేయగా, పతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులు కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరి హాల్‌టికెట్లు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. కాగా అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు జిల్లాకో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధనను అమలు చేస్తుండడంతో గంట ముందుగానే అభ్యర్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
20 మందికి ఒక ఇన్విజిలేటర్
ఉపాధ్యాయ అర్హత పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. ఒక్కో పరీక్షా కేంద్రంలో 240 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. విద్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసు శాఖ సిబ్బంది సమన్వయంతో పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తరగతి గదిలో ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఆరోగ్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత శాఖకు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
216 కేంద్రాలు..49,616 మంది అభ్యర్థులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పేపర్లకు కలిపి 49,616 మంది అభ్యర్థులు హాజరవుతున్నా రు. ఇందులో పేపర్1కు 31,449 మంది అభ్యర్థు లు హాజరుకాగా, అత్యధికంగా మంచిర్యాల్ జిల్లా నుంచి 11,161 మంది, అత్యల్పంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 4822 మంది హాజరుకానున్నారు. పేపర్ 2 పరీక్ష కోసం మొత్తం 18,167 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా..అత్యధికంగా మంచిర్యాల జిల్లా నుంచి 7932 మంది హాజరుకానున్నారు. అత్యల్పంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 2240 మది పరీక్షకు హాజరయ్యారు. వీరందరి కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 216 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి పేపర్‌కు మొత్తం 134 పరీక్షా కేంద్రాలు, రెండో పేపర్‌కు 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జిల్లాకో హెల్ప్‌లైన్ సెంటర్
అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా, సందేహాల నివృత్తి కోసం జిల్లాకో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అభ్యర్థులు తమ హాల్టికెట్లలో తప్పులు, పొరపాట్లు, పరీక్షా కేంద్రాల చిరునామా తదితర విషయాలతో పాటు పరీక్షకు సంబంధించిన వాటిపై సంప్రదించవచ్చు. నిర్మల్ జిల్లాలోని అభ్యర్థులు 9059987730, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులు 9494005060, మంచిర్యాలకు చెందిన అభ్యర్థులు 7032463114, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులు 8790016614 హెల్ప్ లైన్‌ను సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో, సంతకం తప్పనిసరి అని.. అవి లేకుండా ఉన్న వాటిపై గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని టెట్ కన్వీనర్ స్పష్టం చేశారు.
ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు..
టెట్ అభ్యర్థుల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలోని అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను నడుపుతోంది. నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలకు ప్రత్యేక సర్వీసులు నడుపనున్నారు. రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా కల్పించారు. అభ్యర్థులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిపో సిబ్బంది సూచిస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
ఈనెల 12న నిర్వహించనున్న టెట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు నిమిషం నిబంధన అమలుపర్చడంతో గంట మందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావద్దు. వదంతులను ఎవరూ నమ్మవద్దు. జిల్లాలో పరీక్షలను పర్యవేక్షించేందుకు 5 ఫ్ల్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే కలెక్టర్, కస్టోడియన్ అధికారులతో టెట్‌పరీక్ష నిర్వహణపై సమీక్షించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహిస్తున్నాం. ప్రతి పరీక్షా కేంద్రంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నాం. ఆయా జిల్లా శాఖల అధికారులకు చీఫ్ సూపరింటెండెంట్ బాధ్యతలను అప్పజెప్పాం. – డాక్టర్ రవీందర్ రెడ్డి, డీఈవో నిర్మల్