నిర్మల్ అర్బన్, జూన్ 9 : వేసవి సెలవులు ముగింపు దశకొచ్చాయి.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట పట్టారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు పెద్ద సంఖ్యలో విద్యార్థులను బడుల్లో చేర్చుకునేందుకు ఆరాటపడుతున్నాయి. విద్యార్థుల నమోదు శాతమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రైవేట్ పాఠశాలలు బస్సులను ఫిట్నెస్ చేయించకపోవడంపై అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల బస్సుల సామర్థ్యంపై అందరికీ అనేక సందేహాలున్నాయి. 15 సంవత్సరాలకు పైబడి కాలం చెల్లిన వాహనాలను తిప్పుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుండగా.. ఇతర రాష్ర్టాల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వాహనాలకు పైపైన రంగులు అద్దుతూ రోడ్లపై తిప్పుతున్నారు. రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసిన తర్వాతే ఫిట్నెస్ కోసం కార్యాలయం వైపు పరుగులు తీస్తున్నారు.
గతంలో అనేక ప్రమాదాలు..
నిర్మల్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల బస్సులకు గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయినా తమకేమీ పట్టింపు లేదన్నట్లు వాహనాలను నడిపిస్తున్నారు. గతంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గాం చౌరస్తాలో పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. సిద్దాపూర్ వద్ద ఓ పాఠశాలకు చెందిన ప్రైవేట్ బస్సు రోడ్డు నుంచి అదుపు తప్పిపోయింది. పక్కనే లోయ ఉండగా.. అందులోకి దూసుకెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ శివారులో ఓ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. నటరాజ్ మిల్ సమీపంలో విద్యార్థులను తీసుకెళ్లే టాటా మ్యాజిక్ వాహనంలో మంటలు చెలరేగాయి. స్థానికులు స్పందించడంతో వాహనం నుంచి విద్యార్థులను బయటకు తీయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇవి మచ్చుకకు కొన్ని మాత్రమే. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నా యాజమాన్యాలు తేలికగా తీసుకోవడం కొసమెరుపు.
జిల్లాలో 200 స్కూల్ బస్సులు..
నిర్మల్ జిల్లాలో మూడు నియోజికవర్గాలు.. 19 మండలాలున్నాయి. వీటి పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలకు మొత్తం 200 బస్సులున్నాయి. వీటిలో ఇప్పటి వరకు కేవలం 35 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పూర్తి చేసుకున్నాయి. ఇంకా 165 పరీక్షకు రావాల్సి ఉంది. కాగా.. ప్రమాదాలను పూర్తిగా అరికట్టి ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు రవాణా శాఖ అధికారులు కృషి చేస్తున్నారు.ఇందులో భాగంగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.
ఇవీ నిబంధనలు..
ఫిట్నెస్ లేకుంటే బస్సులు సీజ్ చేస్తాం..
జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులతో పాటు ఇతర ప్రైవేట్ వాహనాలు ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్మల్ జిల్లాలో దాదాపు 200 ప్రైవేట్ పాఠశాలల బస్సులు ఉన్నాయి. కేవలం 35 బస్సులు మాత్రమే ఇప్పటి వరకు ఫిట్నెస్కు వచ్చాయి. మిగతా 165 రావాల్సి ఉంది. అన్ని నిబంధనలున్న బస్సులకు మాత్రమే ఫిట్నెస్ చేస్తాం. వాహనాలు అన్ని నిబంధనలతో కార్యాలయానికి రావాలి. లేకుంటే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయం. పాఠశాలల ప్రారంభానికి ముందే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలి.
– అజయ్ కుమార్ రెడ్డి, డీటీవో, నిర్మల్