ఆదిలాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పల్లె, పట్టణ ప్రగతి నాలుగో రోజైన సోమవారం ఉద్యమంలా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు వాడవాడలా కలియ దిరుగుతూ సందడి చేశారు. ర్యాలీలు తీస్తూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మురుగు కాలువలు శుభ్రం చేయించారు. రోడ్లపై చెత్తాచెదారం లేకుండా ఊడ్పించారు. పిచ్చిమొక్కలను తొలగింపజేశారు. వాటర్ ట్యాంక్‌లను క్లీన్ చేశారు. పలుచోట్ల ముథోల్, బోథ్ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రాథోడ్ బాపురావు.. నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, నిర్మల్, ఆదిలాబాద్ కలెక్టర్లు ముషారఫ్ అలీ ఫారూఖీ, సిక్తా పట్నాయక్, అడిషినల్ కలెక్టర్లు పాల్గొని అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నాలుగో రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పారిశుధ్య పనులను పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని బాసరలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోడ్డు పక్కన నాటుతున్న మొక్కలను పరిశీలించారు. ఆలయానికి వెళ్లే రోడ్డుతోపాటు గోదావరి, రైల్వేస్టేషన్ వెళ్లే మార్గాల్లో ఇరువైపులా మొక్కలను నాటాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని కమలాపూర్ గ్రామంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పల్లె ప్రగతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో అధికారులు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చేయవద్దన్నారు.