ఇంద్రవెల్లి, మే 31 : ఆమె ఆదివాసీ బిడ్డ.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మారుతిగూడ గ్రామం. ఆర్కిటెక్చర్ కోర్సు చదువుతున్నది. కళపై ఉన్న మక్కువతో చిత్రాలు గీయడం మొదలుపెట్టింది. దీంతో ఆమె నైపుణ్యానికి పలు అవార్డులు వరించాయి. తాజాగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కింది. మండలంలోని హీరాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మారుతీగూడ గ్రామానికి చెందిన గేడం విశ్వనాథ్-దేవుబాయి ఆదివాసీ గిరిజన దంపతులు. వీరి కూతురు గేడం నాగేశ్వరి. రంగారెడ్డి జిల్లాలోని శ్రీ న్యూ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. పైచదువుల కోసం హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చేరింది. చిత్రకళపై మక్కువతో నైపుణ్యం సాధించింది. ఏప్రిల్ 15,2022న నిర్వహించిన ఆర్ట్స్ పోటీల్లో పాల్గొన్నది. బుద్ధుడి చిత్రంతోపాటు పలు చిత్రాలను పోస్టర్ కలర్లు వైట్, బ్లాక్, బ్లూ, ఎల్లో రంగులతో 30 నిమిషాల్లో 21 సెంటీమీటర్ల వెడల్పు, 41 సెంటీ మీటర్ల పొడవులో వేసింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు.. నాగేశ్వరికి మే 25, 2022లో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్’లో చోటు కల్పించారు. అందుకు సంబంధించిన పత్రాన్ని ప్రదానం చేశారు. మారుమూల గిరిజన గ్రామం నుంచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న నాగేశ్వరిని తల్లిదండ్రులు, మారుతిగూడ గ్రామస్తులు అభినందించారు. ఆమె మరెన్నో అవార్డులు దక్కించుకొని తల్లిదండ్రులు, గ్రామానికి మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు.