ఉట్నూర్, మే 31 : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3వ తేదీ నుంచి చేపట్టనున్న ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి, ఐటీడీఏ ఏపీవో జనరల్ కనక భీంరావ్, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పల్లెప్రగతి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చారులత, వైస్‌ఎంపీపీ బాలాజీ, ఎంపీడీవో తిరుమల, ఎంపీవో మహేశ్, కోఆప్షన్ సభ్యుడు రశీద్, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
అందరూ భాగస్వాములు కావాలి
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలను భాగస్వాములు చేయాలని డీఎల్పీవో భిక్షపతిగౌడ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లకు పల్లెప్రగతి కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యంతో పాటు హరితహారం కార్యక్రమాలపై అధికారులు బాధ్యతగా పని చేయాలన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో గుర్తించిన క్రీడామైదానం పనులు ఈ నెల 2వ తేదీ వరకు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ పుష్పలత, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎంపీడీవో ఆకుల భూమయ్య సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మిగిలిన అభివృద్ధి పనులను గుర్తించి ఐదో విడుతలో పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీవో సుధీర్‌రెడ్డి, సూపరింటెండెంట్ రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ విష్ణు, ఏపీవో విజయ, ఏపీఎం రవీందర్, ఆర్ఐ మహేందర్, ఎంపీటీసీ అశోక్ పాల్గొన్నారు.
ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములై గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి అన్నారు. రెవెన్యూ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో పల్లె ప్రగతి కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలు గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఎఫ్‌డీవో బర్నోబా, డీఎల్పీవో ధర్మరాణి, తహసీల్దార్ రాథోడ్ మోహన్‌సింగ్, ఎంపీడీవో వామనభట్ల రాంప్రసాద్, ఎంపీవో కొమ్ము రమేశ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, అధికారులకు పల్లె ప్రగతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వనిత ఠాక్రే మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం, హరితహారం కార్యక్రమాలపై కార్యదర్శులు బాధ్యతగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శంకర్, ఎంపీడీవో భగత్ రవీందర్, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ఇంద్రశేఖర్ పాల్గొన్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కనక మోతుబాయి అధ్యక్షతన సర్పంచ్, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో పల్లె ప్రగతిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమేశ్ మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు వివరించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, ఎంపీవో స్వప్నశీల పాల్గొన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో సమన్వయంతో పని చేసి పల్లె మురిసేలా ప్రగతి సాధించాలని ఎంపీడీవో గజానన్‌రావు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గోవర్ధన్‌తో కలిసి సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులకు పల్లె ప్రగతి కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మండలంలోని అన్ని పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీవో వెంకటరాజు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.