నిర్మల్, మే 11(నమస్తే తెలంగాణ) : దళితుల బతుకు చిత్రం మారుతున్నది. పొట్టకూటి కోసం పొద్దంతా పనిచేసినా కూలి గిట్టని జీవితాల్లో మార్పు వస్తున్నది. ఇందుకు సీఎం కేసీఆర్ తీసుకొ చ్చిన దళిత బంధు పథకం దోహదం చేస్తున్నది. నిన్నటి వరకు కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారిని ఈ పథకం నేడు యజమానులుగా మార్చింది. వారికి నచ్చిన, తెలిసిన యూనిట్లను ఎంపిక చేసుకోగా, వచ్చిన వాహనాలు, ఇతర యూనిట్లతో ఉపాధి దొరుకు తున్నది. కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే తమ బతుకులు మారుతున్నాయని, ఇదో చారిత్రక పథకమని దళితజాతి స్పష్టం చేస్తున్నది.
దళితుల ఆర్థిక అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంతో నిరుపేదలు సంతోషంగా ఉన్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తూ ఉపాధి పొందేలా చర్యలు చేపట్టారు. దళారులకు గానీ, అవకతవకలకు గానీ ఆస్కారం లేకుండా ప్రతి పైసా లబ్ధిదారుడికే ఉపయోగపడేలా పకడ్బందీగా పథకాన్ని రూపొందించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 100 మందికి తొలిదశలో వర్తింపజేయాలని నిర్ణయించారు. లబ్ధిదారుల ఎంపిక అధికారం నియోజకవర్గ ఎమ్మెల్యేకే ఇచ్చారు. ఒక్కో నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. గుర్తించిన లబ్ధిదారులకు సంబంధించిన సర్వే పూర్తి కాగా, మొదటి విడుతలో నియోజకవర్గాల వారీగా యూనిట్లను అందజేశారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే 78 మంది, నిర్మల్ జిల్లాలో 167 మందికి యూనిట్లను పంపిణీ చేశారు. దీంతో వీరంతా వివిధ వ్యాపారాలు చేస్తూ ఆనందంగా ఉన్నారు. కుటుంబానికి ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. దళిత బంధు పథకం కింద యూనిట్లను ఇప్పించిన సీఎం కేసీఆర్, సంబంధిత ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నాడు కూలీలు.. నేడు ఓనర్లు..
దళిత బంధు పథకం యూనిట్లపై అవగాహన కల్పించేందుకు ఎంపిక చేసిన ప్రతి ఊరిలో అధికారులు ప్రత్యేకంగా సదస్సులు ఏర్పాటు చేశారు. స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకంటూ ఏ యూనిట్‌ను ఎంపిక చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుదన్న కోణంలో వారికి వివరించారు. ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, జీవనోపాధికి ఉన్న అవకాశాలు, వారికి ఉన్న నైపుణ్యం, అందుకు తగ్గట్టుగా వారికి ప్రయోజనకరంగా ఉండే యూనిట్, ఇలా అనేక విషయాలపై ఇప్పటికే సర్వే చేశారు. వాటి వివరాల ఆధారంగా యూనిట్లను ఎంపికచేశారు. క్షేత్ర స్థాయి సర్వే యూనిట్ల ఎంపికపై లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించిన అధికారులు వారికి ప్రయోజనకరంగా ఉండే యూనిట్లను అందజేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో..
జిల్లాలో 313 మందిని ఎంపిక చేయగా, మొదటి విడుతలో 78 మందికి అందజేశారు. ఇందులో 57 మందికి ట్రాక్టర్లు-ట్రాలీలు, 21 మందికి గూడ్స్ వెహికిల్స్ (టాటాఏస్ వాహనాలు) అందజేశారు. ఎక్కువగా ట్రాక్టర్లు, కార్లు, నాలుగు చక్రాల వాహనాలు, ఎక్స్కవేటర్లు, వరికోత యంత్రాలు, డెయిరీ, కిరాణ దుకాణాలు, సెంట్రింగ్, టెంట్‌హౌజ్, ఇలా ఎవరికి నచ్చిన రంగాన్ని వారు ఎంచుకున్నారు. డెయిరీ, సెంట్రింగ్, ఇతర యూనిట్ల వారికి షెడ్ల కోసం రూ.లక్ష నుంచి రూ.1.50 లక్ష వరకు వారి ఖాతాల్లో జమచేశారు. మిగతా డబ్బులను తర్వాత అందజేయనున్నట్లు మంచిర్యాల ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్ తెలిపారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో మొదటి దశలో 238మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో 167మందికి వారు కోరుకున్న యూనిట్లను పంపిణీ చేశారు. వీటిలో 154 వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. అలాగే 3హార్వెస్టర్లు, 4జేసీబీ యంత్రాలను పంపిణీ చేశారు. ఇద్దరు లబ్ధిదారులకు కలిపి ఒక హార్వెస్టర్‌ను, ముగ్గురు లబ్ధిదారులకు కలపి ఒక జేసీబీని కేటాయించారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభమైన మొదట్లోనే వారు అందుకున్న యూనిట్లతో ఆర్థికంగా నిలదొక్కుకునే వైపు పయనిస్తున్నారు.
రంది లేకుంటయ్యింది
హాజీపూర్, మే 11 : నేను గతంలో వ్యవసాయం చేసిన. ట్రాక్టర్ డ్రైవర్, కూలీగా పనిచేసిన. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నరు. పిల్లలు పెద్దగయితున్న కొద్దీ కుటుంబ పోషణ కష్టమయ్యింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంల దరఖాస్తు చేసుకున్న. సర్వే చేసి, వివరాలు తెలుసుకొని ఎంపిక చేసిండ్రు. నేను అడిగినట్లు దళిత బంధు పథకంలో ట్రాక్టర్ ఇచ్చిండ్రు. పొలం పనులు చేసుకుంటున్న. ఎవరైనా రమ్మంటే పోతున్న. పైసలకు రంది లేకుంట ఉన్నది. గిసొంటి పథకం పెట్టి మా అసొంటి పేదలను ఆదుకుంటున్నందుకు ముఖ్యమంత్రి సారు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– దాసరి శాంతయ్య, పర్ధనపల్లి గ్రామం, హాజీపూర్ మండలం
కలలో కూడా ఊహించలే..
రోజుకూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే నేను ట్రాక్టర్ యజమానిగా మారుతానని కలలో కూడా ఊహిం చలే. ఈకలను సాకారం చేసిన ముఖ్యమంత్రి సారుకు మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటది. దళితుల బాగు కోసం సీఎం కేసీఆర్ మంచి ఆలోచన చేసిండు. దళితబం ధు ద్వారా నాకు ట్రాక్టరును అందజేసిన్రు. గ్రామస్తులు తమ పంట చేలల్లో దుక్కి దున్నేందుకు నా ట్రాక్టర్‌ను పంపాలని ముందుగానే వచ్చి బుక్ చేసుకుంటు న్నరు. చాలా సంతోషంగా ఉంది. పనికి వెళ్లిన రోజు డీజిల్ ఖర్చులు పోను 3వేల వరకు మిగులుతున్న య్. ఇంకా ట్రాలీ ఇవ్వలేదు.. త్వరలోనే ఇస్తామని అధికారులు చెప్పిన్రు. ట్రాలీ వస్తే పొలం పనులే కాకుండా ఇతర కిరాయిలకు కూడా వెళ్తా. మొత్తానికి నెలకు రూ.45 నుంచి 50వేల రూపాల దాకా సం పాదిస్తున్న. గతంలో నేను, నా భార్య కూలీ పనులు చేసుకుంటూ దుర్భర జీవితాన్ని గడిపినం. దళిత బంధు ద్వారా ఇంటిల్లిపాది సంతోషంగా ఉండే రోజులచ్చినయ్. -సారంగ చిన్నయ్య, లబ్ధిదారుడు, సాకెర.
మా జీవితాలు బాగు పడినయ్..
మాది నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామం. పేద దళిత కుటుంబాలకు చెందిన మాకు దళితబందు పథకం కింద ముగ్గురికి కలిపి దాదాపు రూ. 30 లక్షలకు పైగా విలువైన జేసీబీని ప్రభుత్వం అందజేసింది. నాతో పాటు గ్రామానికి చెందిన చిర్ర పోసాని, చిర్ర ముత్తవ్వలకు దీనిని కేటాయించిన్రు. జేసీబీని నడిపేందుకు ఒక ఆపరేటర్‌ను పెట్టుకున్నం. రోజూ వివిధ రకాల పనులకు కిరాయికి పంపుతున్నం. గంటకు రూ.1200 చొప్పున ఇస్తున్నరు. రోజులో 5 నుంచి 6 గంటల పని దొరుకుతున్నది. పని ఉన్నన్ని రోజు ఖర్చులు పోను 5 వేల రూపాయలు మిగులుతున్నయ్. ఇలా నెలకు లక్షకు పైగా ఆదాయం వస్తదనుకుంటున్నం. దీనిని ముగ్గురం కలిసి పంచుకుంటం. దళితబంధు ద్వారా మా జీవితాలు బాగుపడ్డయ్. గతంలో కూలీ పనులకు మనుషులు కావాలంటే మా దళితుల వద్దకే వచ్చేటోళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ మాలాంటి పేదలు కూడా సగర్వంగా బతికేలా అవకాశం కల్పించిన్రు.
–చిర్ర నారాయణ, జేసీబీ లబ్ధిదారుడు, ఎల్లపెల్లి
టీఆర్ఎస్సే గుర్తించింది..
మాలాంటి పేద దళితుల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడైండు. గత పాలకులు మా ఓట్లతో లబ్ధి పొందారే తప్ప మా బతుకులను బాగు చేసింది లేదు. మమ్మల్ని టీఆర్ఎస్ ప్రభుత్వమే గుర్తించి అండగా నిలిచింది. నాలాంటి కూలీని కారు ఓనరును చేసింది. ఎన్ని జన్మలెత్తినా కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది. నాకు దళితబంధు పథకం కింద మాతల్లి పోసాని పేరు మీద కారును ఇచ్చిన్రు. నిర్మల్ నుంచి హైదరాబాద్, వరంగల్, ఇతర పట్టణాలకు కిరాయికి నడుపుతున్న. ఒక్కసారి హైదరాబాద్‌కు పోతే ఖర్చులు పోను 2500 నుంచి 3వేల రూపాల దాకా మిగులుతున్నయ్. గతంలో నేను కూలీగా పనిచేసిన. నా భార్య కల్పన బీడీలు చుట్టేది. ఇప్పుడు తలెత్తుకొని గర్వంగా సంపాదించుకుంటున్న. గతంలో మమ్మల్ని పట్టించుకున్నోళ్లే లేరు. ఇయ్యాల సర్కారు మేం అడగకుండానే మంచి చేసింది.
– నాడెం క్రిష్ణ, లబ్ధిదారుడు, ఎల్లపెల్లి
మొదటి విడుత పూర్తయ్యింది..
దళిత బంధుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున అన్ని నియోజకవర్గాల్లో లబ్ధిదారులను ఎంపిక చేశాం. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే, లబ్ధిదారుల ఆసక్తిని బట్టి వారు ఎంచుకునే రంగాల్లో శిక్షణ ఇస్తాం. ప్రభుత్వం ఆదేశానుసారం గ్రౌండింగ్ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసి యూనిట్లు అందేలా చర్యలు తీసుకుంటాం. మొదటి విడుతలో 78 మందికి వారు కోరుకున్న వాహనాలను అందజేశాం. పలు యూనిట్లకు షెడ్ల కోసం రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వారి ఖాతాల్లో జమచేశాం.
– దుర్గా ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్, ఈడీ, మంచిర్యాల
ఆటో డ్రైవర్ని.. ఓనర్నయ్యా..
నా పేరు రేవెల్లి రాజశేఖర్, మా నాన్న పేరు సమ్మయ్య. మా కుటుంబంలో మొత్తం ఐదుగురం ఉంటం. నేను ఇది వరకు ఆటో డ్రైవర్‌గా పనిచేసేది. వచ్చిన డబ్బుల్లో కొంత ఓనరుకు ఇచ్చేది. దళిత బంధు పథకంలో లబ్ధిదారుడిగా ఎంపికైన. ప్రజలను తీసు కపోయి, వచ్చేందుకు సులువుగా ఉంటుందని, దళితబంధులో టాటా ఏస్ తీసుకున్న. ఇప్పుడు నేనే ఓనర్‌ను. రంది లేకుంట బతుకుత. కుటుంబా న్ని బాగా చూసుకుంట. నాకు వాహనం ఇప్పించిన విప్ సుమన్, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంట.
– రేవెల్లి రాజశేఖర్, టాటాఏస్ యజమాని, చెన్నూర్
నెలకు రూ. 30 వేలు సంపాదిస్తున్నా..
నేను కూలి పని చేసుకునేటోన్ని. నా భార్య సుజాత కూడా నాతో పనికొచ్చేది. దళితబందు కింద టాటా మ్యాజిక్ ప్యాసింజర్ బండి ఇచ్చిన్రు. రోజూ నిర్మల్ నుంచి గొల్లమాడ రూట్లో నడిపిస్తున్న. రోజుకు ఖర్చులు పోను వెయ్యి రూపాయలు మిగులుతున్నయ్. పెళ్లిల్లు, ఇతర శుభ కార్యాలకు రోజువారీగా కిరాయి నడిపిస్తున్న. గతంలో ఇద్దరం పనిచేసినా రోజుకు రూ. 400 కూడా మిగిలేటియి కావు. అవి కూడా పనులు ఉన్నప్పుడే కూలి దొరికేది. పని లేనప్పుడు ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వచ్చేది. నాకు ఇద్దరు కూతుళ్లు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నరు. ఇప్పుడు నాకు ఏ చింతా లేదు. నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్న. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..
–మామిడి పోశెట్టి, లబ్ధిదారుడు ఎల్లపెల్లి
జీవితాంతం రుణపడి ఉంట..
కోటపల్లి, మే 11: నా పేరు గారె రమేశ్. మాది కోటపల్లి మండలం మల్లంపేట. నా చిన్నతనం( 6 నెలల వయస్సు)లోనే అమ్మానాన్న చనిపోయిన్రు. చిన్నప్పటి నుంచి అమ్మమ్మే పోషించింది. డిగ్రీ దాకా చదివించింది. నేను డిగ్రీ చదివేటప్పుడు అనారోగ్యంతో అమ్మమ్మ కూడా చనిపోయింది. అప్పటి నుంచి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న. నాకు పెళ్లయ్యింది. 16 నెలల బిడ్డ ఉంది. రోజంతా కష్టపడితేనే కుటుంబం గడుస్తది. నిరుపేదనయిన నేను దళిత బంధు పథకానికి ఎంపికైన. నేను కోరుకున్న ప్రకారం ట్రాక్టర్ ఇచ్చిన్రు. మొన్నటి వరకు ట్రాక్టర్ డ్రైవర్‌గా ఉన్న నేను ఇప్పుడు యజమానినైన. ట్రాక్టర్‌ను పొలం పనులు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన విప్ బాల్క సుమన్, సీఎం కేసీఆర్, మండల నాయకులకు జీవితాంతం రుణపడి ఉంట.