నిర్మల్ టౌన్, మే 11 : ఈ నెల 31వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని, ఆ దిశగా చ ర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, ఏజె న్సీ నిర్వాహకులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ యాసంగి సీజన్లో నిర్మల్ జిల్లాలో లక్షా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తున్నట్లు అంచనా వేశామన్నారు. జిల్లాలో 185 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 86 ప్రారంభించినట్లు చెప్పారు.
ఏడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినందున, కొనుగోళ్లలో వేగం పెంచాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈసారి స్థానిక రైస్‌మిల్లుల్లోనే ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉండేలా చూస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పాటించాలని, ధాన్యం డబ్బులు మూడు రోజుల్లోపు చెల్లించాలని, గన్నీ సంచుల కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ.. వరి ధాన్యం పండించిన రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో రూ.3 వేల కోట్ల నష్టం జరిగినా మద్దతు ధర చెల్లించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ వెంకట్రాంరెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సుధారాణి, డీఎం శ్రీకళ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, డీసీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీలు రామేశ్వర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీలు జీవన్‌రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్లు హరీశ్‌కుమార్, రమణారెడ్డి, కృష్ణప్రసాద్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రూ.23 కోట్లతో పట్టణాభివృద్ది
నిర్మల్ అర్బన్, మే 11: నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి హాజరై మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన నిర్మల్ జిల్లాను కోట్లాది రూపాయల నిధులతో అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చామన్నారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని, ఇతర నాయకులు అభివృద్ధి చేసేందుకు ముందుకురాని పనులను సైతం పట్టణ ప్రజలందరి సహకారంతో చేపట్టామని పేర్కొన్నారు. త్వరలో రానున్న రూ.23 కోట్ల నిధులను పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులకు ఖర్చు చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చుదిద్దుతామన్నారు. అనంతరం 42 వార్డుల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, రానున్న రోజుల్లో చేపట్టబోయే పనులపై చర్చించారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఇన్చార్జి కమిషనర్ అలీం, డీఈ నాగేశ్వర్ రావు, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.