మంచిర్యాల ఏసీసీ, మే 8 : మంచిర్యాల జిల్లాలో తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తుల కోసం రక్త దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిపై మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఏ కమ్యూనిటీ హాలు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తలసేమియా, సికిల్‌సెల్ బాధితులకు మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానలోని రెడ్‌క్రాస్ సొసైటీలో మాత్రమే రక్త మార్పిడిని చేస్తారని, ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడి వచ్చి చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.
తలసేమియా వ్యాధికి నివారణ లేనందున దానికి కొ న్ని జాగ్రత్తలు పాటిస్తూ, మందులను వాడుతూ ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఎప్పటికప్పుడు హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి గ్రస్తులకు 15 రోజులకోసారి జీవితాంతం రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. వేసవి కాలంలో రక్తం కొరత ఎక్కువగా కొరత ఉంటుందని, ఈ మేరకు యువతీ యువకులు రక్తదానం చేయాలన్నారు. తలసేమియా, సికిల్‌సెల్ రోగులకు రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ఆరోగ్య శ్రీ పథకంలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నారని తెలిపారు. వ్యాధిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయ డం అభినందనీయమన్నారు. అనంతరం రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కంకణాల భాస్కర్ మాట్లాడుతూ తలసేమియా, సికిల్సేల్ రోగులకు చికిత్సతో పాటు ప్రతి నెలా మందులను, రవాణా, భోజన సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు. బాధితులకు మాస్కుల పంపిణీ చేశారు.
మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధి గ్రస్తులతో పాటు అత్యవసర ప్రాణపాయ స్థితిలో ఉన్న వారందరికీ సేవలను అందించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ సుబ్బారాయుడు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ చందూరి మహేందర్, జిల్లా కోశాధికారి పడాల రవీందర్, కమిటీ సభ్యులు మధుసూదన్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, సత్యపాల్ రెడ్డి, నాగేందర్, యెడ్ల కిషన్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీనంగర్, వరంగల్ జిల్లాల తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులు, వారి తల్లిదండ్రులు, బంధువులు పాల్గొన్నారు.