బోథ్, మే 8: బోథ్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆదివారం నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఐదో తరగతిలో ప్రవేశానికి బోథ్ కేంద్రానికి 408 మంది విద్యార్థులు కేటాయించారు. 366 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ స్వర్ణలత తెలిపారు. తరగతి గదులను సీఎస్‌తో డిపార్ట్మెంటల్ అధికారి రవికుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాకే లోపలికి అనుమతించారు.
ఇచ్చోడ, మే 8 : గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశ పరీక్షలు ఇచ్చోడలో ఆదివారం ప్రశాంతంగా జరిగాయి.
మొత్తం 971 మంది విద్యార్థులకు నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 288 మంది విద్యార్థులకు గాను 266, గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో 323 మంది విద్యార్థులకుగాను 304, సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో 192 మందికి గాను 172, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 168 మందికి గాను 151 మంది పరీక్షలకు హాజరయ్యారు. 78 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
భీంపూర్, మే8: మండలంలోని అంతర్గాం, కరంజి(టీ), నిపాని, పిప్పల్‌కోటి తదితర ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఐదో తరగతిలో ప్రవేశానికి హెచ్ఎంలు, ఉపాధ్యాయులు విద్యాసంవత్సరం ఆరంభం నుంచి బడిలోనే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అంతర్గాం పాఠశాల హెచ్ఎం శ్రీకాంత్, కరంజి(టీ) హెచ్ఎం భూమన్న వివిధ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేశారు.