ఆదిలాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి);స్వరాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పురుడుపోసుకున్నది. ఎన్నో ఒడిదొడుకులు, రాస్తారోకోలు, సాగరహారాలు, మిలియన్ మార్చ్‌లు, సకలజనుల సమ్మెతోపాటు వివిధ రూపాల్లో ప్రజలు ఉద్యమ ఆకాంక్షను చాటి స్వరాష్ట్ర కలను సాకారం చేసుకున్నారు. నాయకులు పదవులను గడ్డిపోచల్లా విసిరేసి ఉద్యమానికి అండగా నిలిచారు. ఉమ్మడి జిల్లా ప్రజానీకం నాటి నుంచి నేటి వరకు ఉద్యమసారథి కేసీఆర్‌కు అండగా నిలువడంతో ఎన్నికేదైనా గల్లీ నుంచి ఢిల్లీ వరకు గులాబీ జెండానే రెపరెపలాడుతోంది. కేసీఆర్ పరిపాలనలో తన మార్క్ చూపిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా పరుగెత్తిస్తున్నారు. నేడు పాలనా రంగంలోనూ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలకు, యావత్ ప్రపంచ, దేశ దృష్టిని ఆకర్షించే పథకాల అంకురార్పణ చేసి.. తిరుగులేని విజయాలను అందించారు. ఇంటి పార్టీ ఆవిర్భవించి నేటికి 21 వసంతాలు అయిన సందర్భంగా ప్రత్యేక కథనం..
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ త్యాగాల పునాదులపై ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను భరించలేక, ప్రజల చిరకాలవాంఛ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నడుంబిగించారు. 2001, ఏప్రిల్ 27న డిప్యూటీ స్పీకర్, శాసనసభ సభ్యత్వానికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జలదృశ్యం వేదికగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటును ప్రకటించారు. 14 ఏండ్ల ఉద్యమంతో స్వరాష్ట్రం కల సాకారమైంది. ఉద్యమ ఘట్టాలకు నిలువెత్తు సాక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా పరుగెత్తిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారు. నేడు(బుధవారం) ఆవిర్భావ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాగా.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లో ముందస్తుగా మంగళవారం ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.
ఒక్కరితో మొదలై.. విశ్వవ్యాపితమై..
2001లో ఒక్కరితో ప్రారంభమైన పార్టీ నేడు విశ్వవ్యాపితమైంది. అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ర్టాన్ని సాధించుకుంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ పార్టీ ట్యాగ్‌లైన్‌గా వాటినే పెట్టుకున్నారు. గెలిచిన ప్రతి సందర్భంలోనూ పార్టీ నాయకులు ప్రత్యేక తెలంగాణ కోసమే ఉద్యమించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. రాస్తారోకోలు, సాగర హారాలు, మిలియన్ మార్చ్‌లు, సకలజనుల సమ్మెతోపాటు వివిధ రూపాల్లో ఉద్యమ ఆకాంక్షను తెలిపారు. కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకున్న నాయకులు గెలిచిన ప్రతిసారీ రాష్ట్ర సాధన కోసం ప్రజల వెంట నడిచారు. పదవులను గడ్డిపోచల్లా భావించి రాజీనామాలు చేశారు. దీంతో ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ అభ్యర్థులకే ప్రజలు పట్టంగట్టారు.
ఉద్యమసారథి వెంట నడిచి, రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పాటునందించారు. అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు తీయని ఫలాలను అందిస్తుండడంతో ప్రజలు ఆనందంలో ఉన్నారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సైతం పలు వరాలు కురిపించగా, వారంతా ఆది నుంచీ కేసీఆర్ వెంటే ఉన్నారు. ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది సబ్బండ వర్గాలకూ సమన్యాయం చేస్తున్నారు. దీంతో దేశ్‌కీ నేత కేసీఆర్ అంటూ దేశంలోనూ పలు మార్పులు చేపట్టాలని, సుపరిపాలన కోసం పగ్గాలు చేతబూనాలని కోరుతున్నారు.
అభివృద్ధి చూసే పార్టీలోకి..
2001లో కేసీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి మంచి ర్యాల జిల్లా నుంచి కూడా పలువురు ఆయన వెంట నడిచా రు. ఆయన పనితీరుకు మెచ్చి, మరికొందరు మధ్యలో పార్టీలో చేరారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయమే లేని ఏకైక పార్టీగా ఆవిర్భవించి ప్రజల్లో విశేష ఆదరణ చూరగొన్నది. సభ్యత్వ నమోదును కూడా పండుగలా నిర్వహించుకున్నది. ప్రతి నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వం నమోదు చేయా లని అధిష్టానం సూచించగా.. లక్ష్యానికి మించి చేసి ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిరూపించారు. 50 వేలు దాటాక పలువురు చేరేందుకు ముందుకు రాగా, వారి కోసం లక్ష్యాని కి మించి సభ్యత్వం చేశారు. సబ్బండవర్గాలకూ అభివృద్ధి ఫలాలు అందుతుండడంతో టీఆర్ఎస్ వెంటే నడుస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా ముందుకెళ్తున్న పార్టీకి అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు. ఎన్నికలేవైనా టీఆర్ఎస్కే పట్టంగట్టారు. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి, కృతజ్ఞతను చాటుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. దాదాపు జిల్లాలోని అన్ని ఇండ్లల్లోనూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సంక్షేమ పథకం పొంది ఉంటారనేది అందరికీ తెలిసిందే. కుదేలవుతున్న కులవృత్తులకు జీవం పోశారు. విద్య, వైద్యానికి పెద్ద పీట వేశారు. అంపశయ్యపై ఉన్న ఆర్టీసీని బతికించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేలా పలు శాఖలకు నిధులు మంజూరు చేశారు. అభివృద్ధిలో ఎక్కడా రాజీపడకుండా ముందుకెళ్తున్నారు.
స్వరాష్ట్రంలో మెరుగైన రవాణా..
రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమనేత కేసీఆర్ నాయకత్వంలో జిల్లా అడుగడుగునా అభివృద్ధి చెందింది. రవాణా వ్యవస్థ ఎంతో మెరుగపడింది. రాకపోకలకు మార్గం సుగమమైంది. మంచిర్యాల జిల్లాలోని మారుమూల వేమనపల్లి, భీమిని, కన్నెపల్లి మండలాలకు రెండు వరుసల దారులు ఏర్పాట య్యాయి. జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్ర సరిహద్దులోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం వరకు ఫోర్‌లేన్ రహదారి పనులు శరవేగంగా కొనసాగు తున్నాయి. కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహితపై వంతెన నిర్మించడంతో ప్రయాణాలు జోరందుకున్నాయి. ఈ వంతెనతో మూడు రాష్ర్టాలకు రవాణా సౌకర్యాలు ఎంతో సులభమయ్యాయి.
విద్య, వైద్యం..
కొత్త జిల్లాలో వైద్య సౌకర్యం మెరుగు పడింది. జిల్లా కేంద్రంలోని ప్రధా న దవాఖానలో అధునాతన సౌకర్యాలు కల్పించడంతో పాటు అదనపు భవనాలు, స్థాయి పెంపులాంటి చర్యలకు శ్రీకారం చుట్టారు. మెడికల్ కాలేజీ, మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తం గా విస్తరించి ఉన్న సింగరేణి భూ సేకరణ, అటవీ అను మతులు వంటి పనులకు గతంలో మాటిమాటికీ ఆదిలాబాద్ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు 30 కిలోమీటర్ల లోపే గనులు, పనులు, అధికారులు ఉండడంతో పర్య వేక్షణ సులువైంది. విద్యకు పెద్దపీట వేశారు. ప్రభుత్వ విద్య బలోపేతం లో భాగంగా గురుకులాలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో మెరుగైన వసతి, సౌకర్యాలు కల్పించి, విద్యారంగాన్ని బలోపేతం చేశారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద బడులను బాగు చేయడమే కాకుండా నాణ్యమైన విద్య, ఆంగ్ల బోధన కోసం కృషి చేస్తున్నారు.
పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు..
స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఇతర రాష్ర్టాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. వికేంద్రీకరణతోనే జిల్లాలు బాగుపడతాయని విస్తరణకు తీవ్రంగా కృషి చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం పరితపించి మరిన్ని జిల్లాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 70కి చేరుకున్నది. చిన్న జిల్లా ఏర్పాటు తర్వాత పాలన, పర్యవేక్షణ విషయాల్లో మెరుగైన మార్పు వచ్చింది.
వివిధ శాఖల అధికారులతో పాటు కలెక్టర్ కూడా గంటలో ఎక్కడికైనా వెళ్లే వీలు కలిగింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు సమకూరాయి. పారిశ్రామిక, పర్యాటక, అటవీ పాంత్రం ఉండడంతో ఉపాధి ఖిల్లాగాను ఉంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాలో విద్యారంగానికి ప్రాముఖ్యత ఇచ్చారు. రవాణా వ్యవస్థ మెరుగుపడింది. వైద్య సౌకర్యాల మెరుగునకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నది. పరిశ్రమలు, అభివృద్ధి పనులకు సర్కారు మరింత తోడ్పాటు అందిస్తున్నది.
స్వరాష్ట్రంలో ప్రగతి పరుగులు..
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు వెనుకబడిన జిల్లాగా పేరుంది. సమైక్య పాలకులు జిల్లా అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతులు వ్యవ సాయం చేయాలంటేనే భయపడేవారు. ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జిల్లావాసులకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్, గురుకుల స్కూళ్లు, సంక్షేమ పథకాలు జిల్లా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి.
కులవృత్తులకు సర్కారు అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. గ్రామాల్లో ప్రజల ఆర్థికస్థితి పెరిగింది. పథకాలతో గతంలో వ్యవసాయం చేయాలంటేనే భయపడే రైతులు ప్రస్తుతం రెండు పంటలు పండిస్త్తూ లాభాలు గడిస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని కార్పొరేట్ కొలువులు చేస్తున్న వారు కూడా తమ సొంత గ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఫలాలు అందుకుంటున్న జిల్లా ప్రజలు తమ బాగోగులు చూసుకుంటున్న గులాబీ పార్టీకీ అన్ని విధాలుగా అండగా ఉంటామని అంటున్నారు.
పల్లెపల్లెనా పండుగలా..
టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు పండుగలా నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఊరూరా ఏర్పాట్లు చేస్తున్నాయి. గ్రామ, వార్డు(డివిజన్) స్థాయిల్లో బాధ్యుల ద్వారా పెద్ద ఎత్తున గులాబీ జెండాలు ఎగురవేసేలా ప్రణాళికలు రూపొందిం చారు. ఆవిర్భావోత్సవాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సహా నాయకులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బుధవారం గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు, పీఏసీఎస్ డైరెక్టర్లు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు, యూత్, సోషల్ మీడియా నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
జెండాపండుగలో అందరూ భాగస్వాములు కావాలి..
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 21వ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలి. గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతుబంధు సమితి సభ్యులు, ఇతర ప్రజాప్రతి నిధులు కలిసి జెండా పండుగ నిర్వహించాలి. ఉదయం 9గంట లకు అన్ని గ్రామాలు, పట్టణాల్లో గులాబీ జెండాలు ఎగరాలి.
– టెలీకాన్ఫరెన్స్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఉద్యమంలో ఉండడం మా అదృష్టం..
తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోవడం నా అదృష్టం. కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమంలో పాల్గొని ప్రజలతో మమేకమయ్యాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నా. స్వరాష్ట్రం ఏర్పాటు ద్వారానే నేడు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా, కొత్త మండలాలు, పంచాయతీలు ఏర్పడ్డాయి. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల్లో ప్రజలందరి కీ సమన్యాయం జరుగుతున్నది. సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు.
– కోవ లక్ష్మి, జడ్పీ చైర్పర్సన్, ఆసిఫాబాద్.
స్వరాష్ట్ర ఏర్పాటుకు బీజం నిర్మల్ వద్దే..;ఎస్సారెస్పీ కట్టపైనే ఉద్యమ యోచన..
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు మలిదశ ఉద్యమ యోచనకు నిర్మల్‌లోనే బీజం పడిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. 1996లో నిర్మల్ నియోజకవర్గ ఉపఎన్నిక సందర్భంగా నెల రోజులు స్థానికంగానే కేసీఆర్ మకాం వేశారు. ఈ సమయంలో నిర్మల్ జిల్లా సమీపంలోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)ను అప్పటి ఎంపీపీ సత్యనారాయణతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టు దుస్థితిని చూసి చలించిపోయిన కేసీఆర్, కట్టపైనే తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, ఆంధ్రా పాలకుల ఆధిపత్యం, నిధులు, నీళ్లు, నియామకాల్లో వివక్ష, అభివృద్ధి, సంక్షేమ పథకాల కేటాయింపులో నిర్లక్ష్యం మొదలగు అంశాలపై రెండు గంటలకుపైగా సత్యనారాయణగౌడ్‌తో చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తేనే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్న తన మనసులోని మాటను బయటపెట్టారు. అనుకున్నదే తడవుగా అన్నీ తానై ఉద్యమాన్ని నడిపి స్వరాష్ట్ర కలను సాకారం చేశారు.
నిర్మల్‌కు దక్కిన ప్రాధాన్యత..
తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్‌కు ప్రాధాన్యత లభించడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ రూపురేఖలే మారిపోయాయి. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి రెండు సార్లు మంత్రి పదవి ఇచ్చారు. అలాగే సీనియర్ నేత వేణుగోపాలాచారిని ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. సత్యనారాయణగౌడ్ సతీమణి శోభారాణిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. ఇలా అవకాశం వచ్చిన ప్రతీసారి నిర్మల్‌కు అన్ని రంగాల్లో ప్రాధాన్యత లభించడమే కాకుండా, నిధుల కేటాయింపులు భారీగా జరుగుతున్న కారణంగా ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ అభివృద్ధి..
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజన్ ఉంది. అనుకున్నది సాధిస్తారు. కేసీఆర్ చాలా పట్టుదల మనిషి. పార్టీని పెట్టడం, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడం, నాలుగు కోట్ల ప్రజలను పోరాటంలో భాగస్వాములను చేయడం, తెలంగాణ సాధించడం ఇదంతా ఒక్క కేసీఆర్ వల్లే సాధ్యమైంది. సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో చేపట్టని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మనవద్ద అమలవుతున్నాయి. – వీ.సత్యనారాయణగౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి.