నిర్మల్ టౌన్, ఏప్రిల్ 26 :వచ్చే నెల 6 నుంచి 21 వరకు ఇంటర్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు సూచించారు. పరీక్షల నిర్వహణపై ఇంటర్ విద్యాశాఖ, పోలీస్ అధికారులతో కలెక్టరేట్ లో మంగళవారం సమావేశమై మాట్లాడారు. జిల్లాలో 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఫస్టియర్‌లో 7,540, సెకండియర్‌లో 15,649 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఆర్టీసీ బస్సులు సమకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, డీఐఈవో పరశురాం, డీఈవో రవీందర్‌రెడ్డి, వైద్యశాఖాధికారి ధన్‌రాజ్, ట్రాన్స్‌కో డీఈ మధుసూదన్, అడిషనల్ పీఆర్వో తిరుమల ఉన్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
ఎదులాపురం,ఏప్రిల్ 26 : ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిం చాలని ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అవసరం మేరకు సమీప పాఠశాలల్లోని ఫర్నిచర్ సమకూర్చుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలను తెలుసుకునే విధంగా టీఎస్‌బీఐఈ ఎం సర్వీసెస్ మొబైల్ యాప్ పై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. విద్యార్థులు హాల్ టికెట్లను https: tsbie. cgg. gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించడంతో పాటు జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయాలని, ఫ్లయింగ్ స్కాడ్ కోసం ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లను పంపించాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. మే 6 నుంచి 24 వరకు ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయని వివరించారు. జిల్లాలో 33 కేంద్రాల్లో 19650 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. ఫస్టియర్‌లో 10107 మంది, సెకండియర్‌లో 9466 మంది, బ్యాక్‌లాగ్‌లో 77 మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు. ఈ పరీక్షల నిర్వహణకు కలెక్టర్ నేతృత్వంలో హై పవర్ కమిటీ, ముగ్గురు సభ్యులతో జిల్లా పరీక్షల కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డీఐఈవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08732-297115కు గాని, dieo. adilabad @gmail.com కు సమస్యలు ఉంటే తెలియజేయవచ్చని వివరించారు. సమావేశంలో డీఐఈవో సీ రవీందర్, అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, డీఎంహెచ్ నరేందర్ రాథోడ్, డీఈవో ప్రణీత, ప్రభు త్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఈ మాధవరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
ఉత్త మ మార్కులు సాధించాలి
విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఎస్సీ, బీసీ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలపై పట్టణంలోని షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహంలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జ్ఞాన సరస్వతి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబాఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యాశాఖ సహకారంతో ప్రేరణ సదస్సు ద్వారా ఉపాధ్యాయులు గణితం, ఇం గ్లిష్, సైన్స్ తదితర సబ్జెక్టుల్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు సబ్జెక్టుల వారీగా సందేహాలను నివృత్తి చేసుకొని పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో నాణ్యమైన బోధనతో పాటు ఉచితంగా పుస్తకాలు, భోజనం, దు స్తులు, తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సబ్జెక్టుల వారీగా నిపుణులైన ఉపాధ్యాయులతో మోడల్ పేపర్లు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు ప్యాడ్లు, పెన్ను లు, స్కేళ్లు, ఆల్ ఇన్ వన్ పుస్తకాలు పంపిణీ చేశా రు. అంతకు ముందు వసతి గృహంలో మౌలిక సదుపాయాల కల్పనకు చేపడుతున్న పనులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్సీ, బీసీ సంక్షేమ అధికారులు భగత్ సునీత, రాజలింగు, వార్డెన్లు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.