బెల్లంపల్లిరూరల్, ఏప్రిల్ 26: రైతులు శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచించారు. మంగళవారం బెల్లంపల్లి కృషి విజ్ఞానకేంద్రంలో ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం రాజేశ్వర్‌నాయక్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కిసాన్‌మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ఆర్థిక పురోగతిలో రైతుల పాత్ర మరువలేనిదన్నారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ , వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలను అందిపుచ్చుకుంటూ ఆర్థిక పురోగతితో పాటు సుస్థిరతను సాధించాలని ఆకాంక్షించారు. హెచ్‌టీ పత్తి సాగు చేయవద్దన్నారు. వ్యవసాయంపైనే కాకుండా అనుబంధ రంగాలైన కోళ్లపెంపకం, ఆవులు, బర్రెలు, గొర్రెల పెం పకం, తేనెటీగల పెంపకం, పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.
కృషి విజ్ఞానకేంద్రంలో వానపాముల పెంపకం, ఎరువుల తయారీపై నైపుణ్య శిక్షణ పొందిన అభ్యర్థులకు ఎమ్మెల్యే చిన్నయ్య ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మేలు రకాల పంటల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న శాస్త్రవేత్త రాజేశ్వర్‌నాయక్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మంచిర్యాల జిల్లా వ్యవసాయాధికారి కల్పన మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి విధానాలను అవలంబించాలన్నారు. పప్పు దినుసులు, నూనె గింజల సాగుపై ప్రత్యేక దృష్టి సారించి అధిక ఆదాయాన్ని పెంపొందించుకోవాలన్నారు. లీడ్‌బ్యాంక్ మేనేజర్ హవేలీరాజు మాట్లాడుతూ రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులపై అవగాహన పెంచుకోవాలని, సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఉద్యాన, మత్స్య విభాగంలో అందుబాటులో ఉన్న పథకాల గురించి సంబంధిత శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు అనిత, బాపు, ఇంతియాజ్ అహ్మద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఉద్యానవన అధికారి శాంతిప్రియ, మం డల ఉద్యానవన అధికారి సుప్రజ, సమృద్ధి సొసైటీ వ్యవస్థాపకురాలు కవిత, ఆదర్శ రైతులు శ్యామ్ సుందర్‌రెడ్డి, తిరుపతి, మాలగురిజాల సర్పంచ్ అశోక్‌కుమార్, శాస్త్రవేత్తలు నాగరాజు , శివకృష్ణ, స్రవంతి పాల్గొన్నారు.
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
కాసిపేట, ఏప్రిల్ 26 : కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, మెరుగైన విద్య అందుతున్నదని ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని హంగులతో సదుపాయాలు కల్పిస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. మంగళవారం కాసిపేట మండలంలోని పల్లంగూడ ప్రభుత్వ పాఠశాల, చిన్న ధర్మారం పాఠశాల వద్ద మన ఊరు మన బడి కింద అభివృద్ధి పనులను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. పల్లంగూడ పాఠశాలలో మరమ్మతులకు రూ.7.20 లక్షలు, ప్రహరీకి రూ.15 లక్షలు, చిన్న ధర్మారం పాఠశాలలో మరమ్మతులకు రూ.6.50 లక్షలు, ప్రహరీకి రూ.10 లక్షల వ్యయంతో పనులను ప్రారంభించారు.
పేద, మధ్య తరగతి పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, సర్పంచ్‌లు దుస్స విజయ, భూక్యా సునీత, రాంటెంకి శ్రీనివాస్, ధరావత్ దేవి, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, అక్కెపల్లి లక్ష్మి, చంద్రమౌళి, ఉప సర్పంచ్‌లు బోయిని తిరుపతి, పానగంటి అశోక్, ఏఎంసీ డైరెక్టర్ మంజులారెడ్డి, టీఆర్ఎస్ మండల కార్యదర్శి మోటూరి వేణు, గ్రామ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య, ఎంఈవో దామోదర్‌రావు, మాసు సుధాకర్, కుమ్మరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.