ఎదులాపురం, ఏప్రిల్ 26 : ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్న క్రమంలో అభ్యర్థులు కొలువులు సాధించే దిశగా శ్రమించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్‌లోని బీసీ స్డడీ సర్కిల్‌ను మంగళవారం ఆయన పరిశీలించారు. తరగతి గదులు, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థుల వివరాలను బీసీ స్డడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందించడంతో పాటు స్డడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలోని మరో ఆరు చోట్ల మినీ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రంథాలయంలోని సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట నాయకులు రాంకుమార్, రాజు, సురేందర్ ఉన్నారు.
ఈద్గా మైదానం పరిశీలన
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 26 : రంజాన్ పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్‌లో గల ఈద్గామైదానాన్ని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పరిశీలించారు. ఈద్గా ఆవరణలో గల ఖబ్రస్తాన్లో మున్సిపల్ సిబ్బంది పిచ్చిమొక్కలు తొలగించారు. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు మైదానానికి వచ్చే ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అశ్రఫ్, అమ్జద్, సలీమ్, తదితరులు ఉన్నారు.
అంబేద్కర్ సిద్ధాంతాలు పాటించాలి
అంబేద్కర్ సిద్ధాంతాలు నేటి, భావితరాలు పాటించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. అంబేద్కర్, బుద్ధ భగవాన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో దిశగా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. దళిత కుటుంబాల అభ్యున్నతికి దళితబంధు పథకాన్ని అమలు చేశారన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను గుర్తించి రూ.10 లక్షల చొప్పున ఎమ్మెల్యే జోగు రామన్న అందజేశారని తెలిపారు. మరో 1500 మందికి దళిత బంధు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, రాంకుమార్, రాజు, వసంత్, తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మావల, ఆదిలాబాద్ అర్బన్‌లోని 65 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫ్లోర్‌లీడర్ బండారి సతీశ్, కౌన్సిలర్లు లక్ష్మణ్, పందిరి భూమన్న పాల్గొన్నారు.