ఇంద్రవెల్లి, ఏప్రిల్ 26 : ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పొందాలని డీఆర్డీవో కిషన్ కూలీలకు సూచించారు. మండలంలోని ఏమాయికుంట గ్రామ పంచాయతీ పరిధిలోని గురుదేవ్ చెరువు వద్ద మంగళవారం జల జీవన్ మిషన్ గ్రామసభ నిర్వహించారు. కూలీలకు పనులతో పాటు నీటి ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిలో భుగర్భజలాలు పెంచేందుకు చెరువులో ఉపాధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ లఖన్సింగ్, ఏపీవో జాదవ్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్, ఎంపీటీసీ పడ్వాల్ విజయ్‌కుమార్, టీఏ స్వాతి, నాయకులు రాందాస్, రాజలింగు, బాల్సింగ్, అశోక్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు ఎండిపోకుండా చూడాలి
ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున నర్సరీల్లో పెంచుతున్న మొక్కలకు నీరు పోయాలని డీఆర్డీవో కిషన్ నిర్వాహకులకు సూచించారు. అంజి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో పుష్పలత, టీఏ సంతోష్, పంచాయతీ కార్యదర్శి అనిత ఉన్నారు.