ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 18: సామాజిక కార్యక్రమాల్లో యువత ముందుండాలని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో వారం రోజుల ప్రత్యేక శిబిరాన్ని మావల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నీటిని పొదుపు చేయడంపై అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయిందని దీని వలన కలిగే నష్టాలు వివరించాలని సూచించారు. స్వచ్ఛ భారత్, ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఎన్ఎస్ఎస్ యువత ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీల, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రతాప్‌సింగ్, ప్రధానోపాధ్యాయుడు మధు, ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ
బేల, ఏప్రిల్ 18 : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకు మారిన సిలబస్ అనుసరించి రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను జిల్లా కేంద్రంలో కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తన డిగ్రీ కళాశాల సీనియర్ అధ్యాపకులు అనిల్ స్టడీ మెటీరియల్ రూపొందించడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో కీర్తన డిగ్రీ కళాశాల చైర్మన్ పవన్ కుమార్ అగర్వాల్, ప్రిన్సిపాల్ వరప్రసాద్, అధ్యాపకులు ప్రతాప్ సింగ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.