నిర్మల్ చైన్‌గేట్, ఏప్రిల్ 18: ఆరోగ్య రాష్ట్రమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రధాన దవాఖానలో సోమవారం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యమేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో కల్తీ మందుల ప్రభావంతో బీపీ, షుగర్, గుండె వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. నిర్మల్ ప్రధాన దవాఖాన, ఎంసీహెచ్‌లో 45 మంది దాకా వైద్యులు, సిబ్బంది ఉన్నారని తెలిపారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం ఎంతో మెరుగైందని, జిల్లాకో మెడికల్ కాలేజీ మంజూరైనట్లు తెలిపారు. నిర్మల్‌లో 280 బెడ్లతో కొత్తగా దవాఖాన మంజూరు కాగా, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
గతంలో రోగమొస్తే హైదరాబాద్, నిజామాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఇక్కడే అన్ని రకాల వైద్యం అందుతోందని చెప్పారు. ఇకపై పలు వ్యాధులకు సంబంధించి మందులను రోగుల ఇంటికి వెళ్లి నేరుగా అందించేందుకు ప్రభుత్వం యోచన చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో భాగంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత బస్‌పాస్‌లు అందజేశారు. అంతకుముందు వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. సుమారు 450 మంది రోగులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జిల్లా వైద్యాధికారి డా.ధన్‌రాజ్, ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి, ఆర్ఎంవో వేణుగోపాలకృష్ణ, ఎన్సీడీ పీవో రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ముత్యంరెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు సుభాష్‌రావు, వైద్యాధికారులు, నాయకులు పాల్గొన్నారు.
సేవలు సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య శ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని శ్రీ ఆదిత్య దవాఖానలో సోమవారం ఆరోగ్య సేవలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైద్య రంగానికి పెద్దపీట వేసిందన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైద్యులు ప్రమోద్ చంద్రారెడ్డి, జగన్నాథ్, స్వర్ణారెడ్డి, శంశాక్రెడ్డి, మానస, అన్వేష్, కిరణ్ పాల్గొన్నారు.