ఎదులాపురం, ఏప్రిల్ 10 : అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను ఘనంగా జరుపుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. రంజాన్ కానుకగా ప్రతి ముస్లిం కుటుంబానికి దుస్తుల గిఫ్ట్ ప్యాక్ ఇస్తున్నారు. పంపిణీ చేయనున్న దుస్తులు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకోగా.. మసీద్ కమిటీ ఎంపిక చేసిన కుటుంబాలకు అధికారులు పంపిణీ చేయనున్నారు. జిల్లాకు మొత్తం 4500 గిఫ్ట్ ప్యాక్‌లు వచ్చాయి. ఆదిలాబాద్ నియోజకవర్గానికి 3 వేలు, బోథ్ నియోజకవర్గానికి 1500 చొప్పున కేటాయించారు. తెల్ల రేషన్ కార్డున్న కుటుంబాలను ఎంపిక చేసి తహసీల్దార్ సమక్షంలో పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఆదిలాబాద్, బోథ్‌లో మసీద్‌లను ప్రభుత్వం ఎంపిక చే సింది. ఇఫ్తార్ విందు కోసం ప్రభుత్వం రూ.9 లక్షలు మంజూరు చే సింది. ఆదిలాబాద్‌కు రూ.6 లక్షలు, బోథ్‌కు రూ.3లక్షల చొప్పున నిధులు కేటాయించారు.
ముస్లింలకు ప్రభుత్వం అండ..
రాష్ట్రంలో వివిధ మతాలకు చెందిన వారంతా తమతమ పండుగలను ఘనంగా నిర్వహించుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ప థకాలకు శ్రీకారం చుట్టారు. పెద్ద బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆడ బిడ్డలందరికీ బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. క్రిస్మస్, రం జాన్ పండుగలకు పేద కుటుంబాలకు దుస్తులను అందిస్తున్నారు. ప్ర స్తుతం రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్‌లు అందించే ఏర్పాట్లు చేసింది. ఇఫ్తార్ విందుల కోసం కేటాయించిన నిధులను ఆయా మసీద్ కమిటీ సభ్యుల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేస్తారు.
గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీకి ఏర్పాట్లు..
రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో పేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్‌లు అందించేందుకు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మసీద్ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన కుటుంబాల కే తహసీల్దార్ సమక్షంలో అందించనున్నారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు ముందుగానే అధికారులకు పూర్తి వివరాలు అందించారు.
ఈసారి ఘనంగా ఇఫ్తార్ ..
రంజాన్‌ను ఘనంగా జరుపుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఇఫ్తార్ నిర్వహించలేదు. ఈసారి జిల్లాకు రూ.9 లక్షలు మంజూరయ్యాయి. గిఫ్ట్ ప్యాక్‌లను మసీద్ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన కుటుంబాలకే తహసీల్దార్ సమక్షంలో అందిస్తారు. త్వలోనే ఇఫ్తార్ తేదీని స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి నిర్ణయిస్తాం.
– కృష్ణవేణి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి, ఆదిలాబాద్