సోన్, ఫిబ్రవరి 24 : జిల్లాలోనే మొట్టమొదటిసారిగా సోన్ మండల కేంద్రంలోని మోడల్ గ్రంథాలయంతో పాటు విద్యార్థులకు ఆట వస్తువుల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే తెలిపారు. సోన్ మండల కేంద్రంలోని మోడల్ ఆట వస్తువుల గ్రంథాలయ కేంద్రం, గ్రామ పంచాయతీని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేండ్ల లోపు పిల్లలకు చదువుతో పాటు ఆడుకునేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు చదువుకొని ఆ తర్వాత రెండు గంటల పాటు ఆట వస్తువులతో పిల్లలు ఆడుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. త్వరలో ఈ ఆట వస్తువుల గ్రంథాలయాన్ని మంత్రి ప్రారంభించనున్నట్లు సర్పంచ్ తిరుక్కోవెల వినోద్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాయిరాం, ఎంపీవో అశోక్, కార్యదర్శి, వార్డుసభ్యులు పాల్గొన్నారు.