భైంసాటౌన్, ఏప్రిల్ 2 : భైంసా వైద్యుల సేవలు శ్లాఘనీయమని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. పట్టణ వైద్యబృందం ఎమ్మెల్యేను దేగాంలో శనివారం కలిశారు. ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను విన్నవించారు. ప్రజలకు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తామని వైద్యులు పేర్కొన్నారు. కొంత మంది శుభఘడియలని, మూఢ నమ్మకాలతో సిజేరియన్ కోసం వైద్యులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, అయినా సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. చిన్న విషయాలకే వైద్యశాలలను సీజ్ చేయడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్ముందు మరింత మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల ఆదరణ చురగొనాలన్నారు. వైద్యుల సేవలను గుర్తుచేస్తూ కొవిడ్ పరిస్థితి దృష్ట్యా రెండేళ్లపాటు ఊహించని పరిణామాలను తట్టుకొని శక్తికి మించి పనిచేసి విజయవంతంగా విధులు నిర్వహించినందుకు అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేను వైద్య బృందం పూలమాల, శాలువాతో సన్మానించి మిఠాయిలు తినిపించారు. సీనియర్ వైద్యుడు దామోదర్ రెడ్డిని ఎమ్మెల్యే సత్కరించారు. భైంసా ఏరియా దవాఖాన సూపరింటెండెంట్, పిల్లల వైద్య నిపుణుడు విజయానంద్, వైద్యులు అనిల్, అజయ్ రెడ్డి, ముత్యం రెడ్డి, నాయకులు నందకిశోర్, సోలంకి భీంరావ్ పాల్గొన్నారు.
పాడి పంటలతో విలసిల్లాలి
కుంటాల, ఏప్రిల్ 2 : నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు, రైతులు ఆయురారోగ్యాలు, ఐష్టెశ్వర్యాలతో విలసిల్లాలని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి ఆకాంక్షించారు. ఉగాదిని పురస్కరించుకొని కుంటాల టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నదని, పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నదని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి మిఠాయిలు పంచిపెట్టారు. పార్టీ మండల కన్వీనర్ పడకంటి దత్తు, రైతుబంధు సమితి అధ్యక్షుడు మహేశ్, ఆత్మడైరెక్టర్ భూమ న్న, ఏఎంసీ డైరెక్టర్ గజేందర్, నాయకులు వెంకటేశ్, అనిల్, వినోద్, లక్ష్మణ్, హరి పాల్గొన్నారు.