హరితహారానికి సిద్ధమవుతున్న మొక్కలు
28 నర్సరీల్లో 3లక్షల 30 వేల మొక్కల పెంపకం
తలమడుగు, ఏప్రిల్ 2 : మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు హరితహారానికి సిద్ధమవుతున్నాయి. ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమం కోసం మొక్కలు ఎండిపోకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సిబ్బంది ప్రతి రోజూ నీరు పట్టడంతో పాటు గ్రీన్నెట్స్ ఏర్పాటు చేశారు.
పెరుగుతున్న మొక్కలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎనిమిదో విడుత హరితహారం కోసం మండలంలోని 28 గ్రామ పంచాయతీల పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నర్సరీల్లో 10 వేల మొక్కల లక్ష్యం మొత్తం 3 లక్షల 30 వేల మొక్కలు పెంచాలని అధికారులు నిర్ధేశించారు. గన్నేర్, రెయిన్‌ట్రీ, బురగ, కానుగ, జామ, దానిమ్మ, నిమ్మతో పాటు పలు రకాల పండ్లు, పూల మొక్కలు పెంచుతున్నారు. ఎండకు ఎండిపోతాయని ముందస్తు జాగ్రత్తతో నర్సరీల్లో అదనంగా మొక్కలు పెంచుతున్నారు.
సంరక్షణ బాధ్యత సర్పంచ్, కార్యదర్శులదే
గతంతో మండలంలోని కొన్ని గ్రామాల్లో మొక్కలు పెంచి ఇతర గ్రామాలకు సరఫరా చేసేవారు. కాని అప్పుడు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. మొక్కల సంరక్షణ బాధ్యత సర్పంచ్, పంచాయతీ కార్యదర్శలకు అప్పగించారు. నిర్లక్షం చేస్తే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున మొక్కలను కంటికి రెప్పల కాపాడుతున్నారు. ఎంపీడీవో, ఎంపీవో, ఉపాధి హామీ అధికారులు నర్సరీలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.
హరితహారంపై ప్రత్యేక దృష్టి
గ్రామంలో హరితహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గతంలో నాటిన మొక్కలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఈ సంవత్సరం నర్సరీలో అన్ని రకాల మొక్కలు పెంచుతున్నాం. గ్రీన్నెట్ను ఏర్పాటు చేసి నీరు పోస్తున్నాం, దాదాపు 15 వేల మొక్కలు పెంచుతున్నాం.
–కళ్లేం కరుణాకర్ రెడ్డి, సర్పంచ్, తలమడుగు