ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఅంబులెన్స్ ప్రారంభం
ఎదులాపురం, ఏప్రిల్ 2 : కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచేలా దుర్గం ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గం ట్రస్ట్ కార్యాలయంలో శనివారం దుర్గం శేఖర్ తన తల్లి చిన్నుబాయి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అంబులెన్స్ సేవలను తల్లి ఆశయం మేరకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్, నాయకులు సాజిదొద్దీన్, శైలేందర్, గంగారెడ్డి, మోహన్, రఘు, సుధాకర్, ఇమ్రాన్, రిజ్వాన్, ఆమెర్ పాల్గొన్నారు.