ఆదిలాబాద్ టౌన్ ఏప్రిల్ 1: దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిచ్ధరి గ్రామంలో 45 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ.4.5కోట్ల ఆస్తుల మంజురు పత్రాలను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడూతూ అంబేద్కర్ ఆశయ సాధనకు కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమవుతాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఉన్నాయా..? అని స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. అనంతరం గ్రామంలో మేకల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీపీ లక్ష్మీ జగదీశ్, వైస్ ఎంపీపీ రమేశ్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లద్, పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్ సర్పంచ్ లక్ష్మీసుభాష్, నాయకులు ఆరే నరేశ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మాకు ముందే ఉగాది వచ్చినట్లయ్యింది..
మా కుటుంబానికే కాదు పల్లెకే ఈ రోజు ( శుక్రవారం ) ఉగాది పండుగు వచ్చినట్లు అనిపిస్తున్నది. గుంట భూమి లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు దేవుడి లెక్కా సీఎం కేసీఆర్ సారు దళితబంధు ప్రారంభించిండు. మేకల మంద కోసం సార్లకు దరఖాస్తు చేసుకున్నాం. ఆలస్యం చేయకుండా ఈ రోజు రూ.10 లక్షల విలువైన పత్రాలు అందించారు. వాటితో మేకల మంద తీసుకొని పెంచుతూ ఉపాధి పొందుతాం.
– సర్కాడె జీజాబాయి ,దళితబంధు లబ్ధిదారు ,చిచ్ధరి గ్రామం ,ఆదిలాబాద్ మండలం
సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా..
మాది కూలీ కుటుంబం . భార్యభర్తలు ఇద్దరం పనిచేస్తేనే బతుకుడు కష్టంగా ఉన్నది. దీంతో ఇల్లు గడుచుడు, పిల్లల చదువులు , లగ్గాలు, ఎట్లా అని బాధపడేవాళ్లం. ఇంతలోనే సీఎం కేసీఆర్ సారు దళితబంధు ఇస్తున్నారని తెలిసుకున్నాం. మా సర్పంచ్, సార్ల దగ్గర పేరు రాయించినాం. ఎమ్మెల్యే రామన్నసారుకు మా పరిస్థితి చెప్పినం. దీంతో ఎమ్మెల్యే కూడా భరోసా ఇచ్చాడు. ఈ రోజే మాకు రూ.10 లక్షల పత్రాలు అందించారు. వీటితో మేకల మంద కొనుగోలు చేస్తాం. ఏడాదిలోనే మందకు మంద చేస్తాం.
–కాంబ్లె జయమాల ,లబ్ధిదారు ,చిచ్ధరి ,ఆదిలాబాద్ మండలం