ఆదిలాబాద్, మార్చి 30 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. పెన్‌గంగలో ఇసుక తవ్వకాలతో రైతులతోపాటు పర్యావరణానికి నష్టం జరుగుతుందని, క్వారీలు ఏర్పాటు చేసే అవకాశం లేదని మైనింగ్ అధికారులు గతంలో నివేదికలు ఇచ్చారు. దీంతో ఇసుక తవ్వకాలను ఎలాంటి అనుమతులు లేవు. జైనథ్ మండలం పెండల్వాడ, డొల్లార, కౌఠ, సాంగ్వి గ్రామ పరిసరాల్లోని పెన్‌గంగ నుంచి వందల ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు. జిల్లాతోపాటు మహారాష్ట్రలో ఇసుకకు డిమాండ్ ఉండడంతో అక్రమ రవాణా సాగుతున్నది. విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరిట దళారులు ఈ దందాను సాగిస్తూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు అప్పుడప్పుడూ తనిఖీలు నిర్వహిస్తున్నా అక్రమ బాగోతానికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది.
ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం పెండల్వాడ, డొల్లార, కౌఠ, సాంగ్వీ గ్రామాల్లోని పెనగంగ నది ప్రవాహం కొనసాగుతున్నది. వర్షాకాలంలో నిండుగా ప్రవహించడంతో ఇసుక మేటలు భారీగా పేరుకుపోతాయి. జిల్లాలో ఇసుక క్వారీలకు అవకాశం లేదని నది పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తే రైతులు, స్థానికులకు నష్టం జరుగుతుందని భాగర్భజల వనరుల శాఖ అధికారులు కలెక్టర్‌కు నివేదికలు ఇచ్చా రు. నది ప్రవహించే చోట భూమి నుంచి రెండు మీటర్ల పైనే ఇసుక నిల్వలు ఉంటే అనుమతులు లభిస్తాయి. జిల్లాలో పెన్‌గంగ నది పరీవాహక ప్రాంతాల్లో రెండు మీటర్ల లోపు ఇసుక పేరుకొని ఉంటుంది. ఇక్కడ ఇసుకను తొడితే భూగర్భజలాలు ఇంకిపోతాయని, రైతులకు సాగునీటి సమస్యలు ఎదురవుతాయని దీంతో ఇసుక క్వారీలకు అనుమతులు లభించలేదు. ఆదిలాబాద్ జిల్లాలో క్వారీలకు ఎలాంటి అనుమతులు లేవు. అధికారిక పనులకు కాంట్రాక్టర్లు మంచిర్యాల జిల్లా గోదావరి నుంచి ఇసుకను తీసుకువస్తారు.
యథేచ్ఛగా రవాణా
ప్రైవేట్ భవనాలు, ఇతర నిర్మాణాలకు అవసరమైన ఇసుకను పెన్‌గంగ నది ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తారు. అధికారికంగా ఎలాంటి అనుమతులు లేకున్నా దళారులు దందా మాత్రం కొనసాగుతున్నది. దళారులు ఒక్కో క్వారీని రూ.5 లక్షల నుంచి రూ.40 ల క్షల వరకు దక్కించుకుంటారు. ట్రాక్టర్లు, టి ప్పర్ల ద్వారా జిల్లాలని వివిధ ప్రాంతాలతో పా టు మహారాష్ట్రకు రోజు వందల సంఖ్యలో ఇ సుక ట్రాక్టర్లో రవాణా కొనసాగుతుంది. ఇసుక తీసుకెళ్లే ప్రాంతంలో దళారులు నలుగురిని కాపలా ఉంచుతారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 400 నుంచి రూ.500 వసూలు చేస్తారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి నిర్వహించిన వేలంలో కంటే రెండింతలు సంపాధిస్తారు. చలికాలంలో ప్రారంభమైన ఈ అక్రమ వ్యవహారం ఎండకాలం వరకు సాగుతుంది. నది నుంచి తీసుకువచ్చిన ఇసుకను భారీగా డంప్ చేసి విక్రయిస్తారు. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భజలాలు అండుగంటి పోతున్నాయి. దీంతో రైతులకు సాగునీటికి, స్థానికులకు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
54 కేసుల నమోదు
ఈ ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 54 కేసులు నమోదు చేసి రూ.7.61 లక్షల జరిమానా విధించారు. జిల్లాలో క్వారీలకు ఎలాంటి అనుమతులు లేవు. పెన్‌గంగ నది పరీవాహక ప్రాంతాల్లో క్రమంగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి పై చర్యలు తీసుకుంటున్నాం.
– రవిశంకర్, మైనింగ్ ఏడీ, ఆదిలాబాద్