కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల తండాలు, గూడేలు, పల్లె ప్రాంతాల్లో నివసించే ఆదివాసులు మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు. ఇందులో తేనె, ఇప్పపూలు, ఇప్పగింజలు, తప్సిబంక, తేనెమైనం, మారేడు గడ్డలు, చింతపండు, ఎండుఉసిరి, విషముస్టిగింజలు, చిల్ల గింజలు, నరమామిడి చెక్క, కరక్కాయలు, కుంకుడుకాయలు, నల్లజీడి గింజలు, కానుగ గింజల వంటి 15 రకాల ఉత్పత్తులను సేకరించి గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు విక్రయించి ఉపాధి పొందుతున్నారు. వీటితోపాటు మొర్రిపండ్లు, గింజలు, జీడిపండ్లు, తునికి పండ్లను ఆహారంగా కూడా తీసుకుంటారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసులకు అటవీ ఉత్పత్తులు ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. పెట్టుబడి లేకుండా కేవలం శ్రమపైనే వందలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ప్రతి వేసవి కాలంలో మూడు నెలలు వ్యవసాయ పనులు లేకపోవడంతో అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు.
ఇప్పపూల సేకరణతో ఉపాధి..: ఆదివాసీ గిరిజనులు ఉదయాన్నే అడవులకు వెళ్లి ఇప్పపూలు సేకరిస్తారు. ఇంటికి తీసుకొచ్చి ఎండబెడతారు. ఆహారంగా తీసుకోగా మిగిలినవి వ్యాపారులకు, జీసీసీ ఏర్పాటు చేసిన డీఆర్ డిపోల్లో అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు.
ఇప్పపరక..: ఇప్ప పరకను ఆదివాసులు అధికంగా నూనెగా ఉపయోగిస్తారు. వంట చేసుకోవడానికి, దీపం వెలిగించుకోవడానికి వాడుతారు. దీనిని అమ్మడానికి ఇష్టపడరు. కానీ.. ఇతర సరుకుల అవసరాల కోసం కొంత విక్రయిస్తారు.
మొర్రి పండ్లు, గింజలు.. : మొర్రిపండ్లు, గింజలకు పట్టణ ప్రాంతాల్లో మంచి గిరాకీ ఉంది. ఇవీ గిరిజనులకు మంచి ఆదాయ వనరు. పలుకులు, గింజలకు అధిక ధర ఉంటుంది. దుకాణాల్లో పది గ్రాముల పలుకులు రూ.30 పలుతున్నాయి. కాగా.. ఆదివాసులు తినేందుకు, పండుగలప్పుడు చేసే ప్రత్యేక వంటకాల్లో ఉపయోగిస్తారు.
జీడి పండ్లు..: ఉట్నూర్ ఏజెన్సీ అడవుల్లో జీడిపండ్లు చాలా అరుదుగా దొరుకుతాయి. వీటిని నిల్వ ఉంచడం కష్టం కనుక అమ్మేందుకు మొగ్గు చూపుతారు. అరుదుగా దొరికే ఈ చెట్లను రక్షిస్తారు. కొందరు తమ చేలలోనే పెంచుకుంటారు.
తునికి పండ్లు.. : మన వద్ద తునికి పండ్లు విరివిగా లభిస్తాయి. ఇప్పపూలు, తునికాకు సేకరణకు వెళ్లినపుడు వీటిని తీసుకొస్తారు. వీటిని పిల్లలు ఇష్టంగా తినడంతో అమ్మరు. ఈ పండ్లు తింటే వేసవిలో వచ్చే వ్యాధులను నివారిస్తాయని నమ్మకం.
కొనుగోలుకు ఏర్పాట్లు చేశాం..
ఆదివాసీ గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా 15 డీఆర్ డిపోలను ఏర్పాటు చేశాం. తేనె 200 కిలోలు, ఇప్పపూలు 400 కిలోలు, మిగతా అటవీ ఉత్పత్తులను ఎంత ఇచ్చినా కొనుగోలు చేస్తాం. మన జిల్లాలో తేనె, ఇప్పపూలు తప్పా మిగతావి రావడం లేదు. అదివాసులు సమీపంలోని డీఆర్ డిపోలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించి డబ్బులతోపాటు రసీదు కూడా తప్పకుండా తీసుకోవాలి. ఈ యేడాది కూడా ఉత్పత్తుల కొనుగోలుకు ఏర్పాట్లు చేశాం.
– పాపారావ్, జీసీసీ మేనేజర్