ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి
ఎదులాపురం,మార్చి30: అటవీ ప్రాంత ఆవాసాలకు త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. హైదరాబాద్‌లోని అరణ్య భవన్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు తో కలిసి బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తన కార్యాలయం నుంచి ఐటీడీఏ పీవో అంకిత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి అటవీ ప్రాంతాల ఆవాసాలకు త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు జిల్లాలో సంబంధిత శాఖలు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడారు. జిల్లాలోని 44 అటవీప్రాంతాల ఆవాసాలకు సింగిల్ ఫేస్ నుంచి త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసేం దుకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. అనుమతులు వచ్చిన ఆవాసాలకు గ్రామసభల ఆమోదం, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం తో గిరిజన గ్రామాల్లో వ్యవసాయం, ఇతరాత్ర పనులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, ట్రాన్స్‌కో ఎస్ఈ ఉత్తమ్ జాడే, గిరిజన సంక్షేమ శాఖ డీడీ సంధ్యారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.