ఎదులాపురం, ఫిబ్రవరి 22 : భవిష్యత్ జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆదిలాబాద్ పట్టణ మాస్టార్ ప్లాన్‌ను రూపొందిస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణ మాస్టర్ ప్లాన్‌పై కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం వర్క్ షాప్ నిర్వహించారు. ముందుగా గత 30 ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్, ప్రస్తుతం రూపొందించనున్న మాస్టర్‌ప్లాన్‌ను డీటీసీపీ జేడీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడారు. రాబోయే 20 ఏళ్లకు అనుగుణంగా టౌన్ ప్లాన్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఇందుకోసం పట్టణ ప్రజలు, అన్ని రాజకీయపార్టీల నాయకులు అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు.
పట్టణంలో మరోసారి భూ సర్వే చేయిస్తామన్నారు. కలెక్టర్ సూచనల మేరకు మున్సిపల్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయిస్తామని, పట్టణ ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. పట్టణ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వర్క్‌షాప్ చాలా ముఖ్యమైనదని కలెక్టర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్‌పై వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అందులో 36 శాఖల అధికారులు, పట్టణ కౌన్సిలర్లు, యువజన సంఘాల నాయకులను చేరుస్తామని చెప్పారు. పట్టణంలో రూ. వందల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. అధికారుల సమన్వయంతో పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సాన్థిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ అభిప్రాయలను వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ జేడీ రమేశ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శైలజ, డీఎస్పీ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.