రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు
రవాణా వ్యయంతో నిత్యావసరాలపై ప్రభావం
బెంబేలెత్తుతున్న సామాన్యులు..
మంచిర్యాల టౌన్, మార్చి 27 : కొవిడ్ నుంచి కోలుకోక ముందే ఇంధన ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఊహించినట్టుగానే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగియగానే కేంద్రం ధరలు పెంచింది. వారం రోజులుగా రేట్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడు రోజుల వ్యవధిలో పెట్రోల్ రూ.4.13, డీజిల్ రూ.3.43 పెరిగాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌కు రూ.113.45, డీజిల్‌కు రూ.99.70 ఉంది. దీనికితోడు గ్యాస్ సిలిండర్‌పై అమాంతం రూ.50 పెంచగా.. ప్రస్తుతం డొమెస్టిక్ రూ.1023.50, కమర్షియల్ రూ.2,227 ఉంది. ఫలితంగా నిత్యావసరాల ధరలపై ప్రభావం పడుతున్నది. సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.
కొవిడ్-19 నుంచి కోలుకోక ముందే ఇంధన ధరలు మంట పుట్టిస్తున్నాయి. అనుకున్నట్లుగానే ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగియగానే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజులుగా పెరుగుతున్నాయి. ఈ వారం వ్యవధిలో పెట్రోల్ రూ.4.13 పెరిగి రూ.113.45 కు చేరింది. అలాగే డీజిల్ కూడా రూ.3.43 పెరిగి రూ.99.70కు చేరింది. దీని ఫలితంగా నిత్యావసర వస్తువులైన కూరగాయలు, పాల వంటి వాటిపై ప్రభావం పడుతున్నది. కిరాణా సామగ్రి ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుడి జీవనం అతలాకుతలం అవుతున్నది. కుటుంబాల ఆర్థిక వ్యవస్థ కూడా ఛిన్నాభిన్నం అవుతున్నది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకు గా చూపుతూ కేంద్రం ఇబ్బడిముబ్బడిగా పెట్రో లు, డీజిల్ ధరలు పెంచడం విడ్డూరమని ప్రజలు పేర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ ధర కూడా అమాంతం పెంచడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
ఇక కట్టెల పొయ్యిలే దిక్కంటూ ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. 2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ.500-550 ఉండగా.. ప్రస్తుతం అది రెట్టింపయింది. ఇంకా ఒకేసారి రూ.50 పెంచడంతో సిలిండర్ ధర రూ.1000 దాటింది. దీంతో పెనుభారం పడుతుందని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. డొమెస్టిక్ ధర రూ.1,023.50 ఉండగా.. కమర్షియల్ రూ.2,227కు చేరింది. మరో పక్క కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను చూసి జ నం మండిపడుతున్నారు. ఇటువంటి సర్కారు ను చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు, మధ్యతరగతి వారు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 20న మంచిర్యాలలో లీటరు పెట్రోలు ధర రూ.109.32 ఉండగా.. 27వ తేదీ నాటికి రూ.113.45 కి చేరింది. డీజిల్ ధర కూడా 20వ తేదీన రూ.95.87 ఉండగా.. 27వ తేదీ నాటికి రూ.98.27కి చేరింది. పె ట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల తో వాహనదారులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. చాలా మంది వాహనా లు తీయడానికి జంకుతున్నారు. ఇం కా.. పెట్రోల్ ధర రూ.125, డీజిల్ ధర రూ.115 దాటే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పేదోడి కడుపు నిండొద్దా..
ఇంద్రవెల్లి, మార్చి27: ఇయ్యాల, రేపు పేదోడు బతుకుడే కష్టమైతంది. గిట్ల ధరలు పెంచుకుంట పోతే ఏం తింటం.. పిల్లలను ఎట్ల సదివిత్తం. మార్కెట్లకు పోయి ఏమ న్నా కొందమంటే ధరలు మండవట్టే. పప్పు, ఉప్పులు కొందామంటేనే భయమైతున్నది. గ్యాస్ అయిపోయింది అంటేనే దడ పుడుతున్నది. గింత రేటు నా జీవితంల సూడలె. గిదేం సర్కారు. పేదోడు కడుపు నింపుకోవద్దు అన్నట్లే చేస్తున్నరు. మళ్లా కట్టెల పొయ్యే నయమనిపిస్తున్నది. మోడీ సారు అచ్చాదిన్ అనుకుంట.. సచ్చేదిన్ చేస్తున్నడు. పెద్దోళ్లను బతికించడానికే మా కడుపులు కొట్టుడేంది. ఆకలితో కడుపులు మాడ్చుకునే రోజులు వచ్చేలా చేస్తున్నరు. వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలే. లేకుంటే పేదోళ్ల పాపం తాకుతది.
–బబిత గృహిణి(కెస్లాగూడ)
బంక్ కాడికి పోవాలంటేనే భయమవుతుంది..
భైంసా, మార్చి 27 : నా పేరు అళా. నేను నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కిసాన్గల్లిలో ఉంట. ఫ్రిజ్ మెకానిక్‌గా పనిచేస్తా. పట్టణంలో ఎవరైనా రిపేర్ చేయాలని పిలిస్తే వెళ్తా. గతంలో రూ.50 పెట్రోల్ పోసుకుంటే.. పోయివచ్చేనోన్ని. గిప్పుడు పెట్రోల్ ధర పెరిగినంక రూ.100 లేంది బయటకు బండి తీయడం కష్టంగా మారింది. కేంద్ర ప్రభుత్వం గిట్ల ధరలు పెంచుకుంటూ పోతే బతకడం ఎట్ల. బంక్ కాడికి పోవాలంటేనే భయమవుతున్నది. మాసోంటోళ్లకు కష్టమే మరి. పెట్రోల్ ధరలు తగ్గించాలి.
వంద కూడా మిగలట్లే..
సోన్, మార్చి 27: 20 ఏళ్లుగా ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న. రోజురోజుకూ డీజిల్ ధరలు పెరగవట్టే. రోజంతా ఆటో నడిపినా, వంద కూడా మిగలకపాయే. సంపాదించిందంతా డీజిల్‌కే సరిపోతాంది. మేం రేట్లు పెంచితే ఆటో ఎక్కేటోళ్లు గింతైతే మేం రాం అంటరు. ఇట్లనే డీజిల్ రేట్లు పెంచుకుంట పోతే ఇగ మేం బతుకుడు కష్టమే. పేదోళ్ల మీద దయలేకుండా గిట్ల పెంచుకుంట పోయి ఆయిల్ కంపెనోళ్లను బతికించుడు మంచిగ లేదు. మా కష్టమంతా ఆయిల్ కంపెనీకి ఇస్తే, మేం కడుపు నిండా తినొద్దా.. మా కుటుంబాలకు అన్నం పెట్టొద్దా? పేదలను ముంచుడే ఈ కేంద్ర ప్రభుత్వానికి తెలిసి నట్లుంది. సామాన్యులకు మంచి చేస్తే దేవుడంటరు.. సంపా దించినోళ్లకు కాదు.
–ఆకుల రమేశ్, ఆటో డ్రైవర్, వెంగ్వాపేట్