4.38 లక్షల పని దినాలు లక్ష్యం
ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభం
నార్నూర్, మార్చి 27 : వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలో 4.38 లక్షల పని దినాలు కల్పించాలని మండల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రధానంగా వ్యవసాయ, చెరువుల పునరుద్ధరణ, చేపల చెరువుల ఏర్పాటు, హరితహారం, నర్సరీల పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభంకానున్నాయి. నార్నూర్ మండల పరిధిలో 23 గ్రామ పంచాయతీలు, 68 ఆవాసాలు ఉన్నాయి. 9,042 ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉండగా 11,940 మంది కూలీలు ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4.28 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యం పెట్టుకోగా 3.92 లక్షల పని దినాలు (93 శాతం) కల్పించారు. మొత్తం 5,983 కుటుంబాల్లో 8,300 మంది కూలీలు లబ్ధిపొందారు. 1,404 కుటుంబాలు మాత్రమే 100 రోజులు పనిని పూర్తి చేసుకున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4.38 లక్షల పని దినాలు కల్పించాలని అధికారులు ఇటీవల చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
పని లేదంటే భృతి…
ఎవరైనా కూలీ పని అడిగిన 14 రోజుల్లో పని కల్పించని పక్షంలో భృతి ఇవ్వాలని ఉపాధి హామీ చట్టంలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అమలు కావడం లేదు. ఈ సారి ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌లో పనుల వివరాలు నమోదు కానున్నాయి. సకాలంలో పనులు కల్పించకపోతే అధికారులకు జరిమానా విధించనున్నారు. ఇలా వసూలు చేసిన జరిమానా నుంచి కూలీలకు భృతి చెల్లించనున్నారు. తాజా మార్పులతో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో ప్రతి గ్రామంలో కల్పించిన పనుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ప్రతి కూలీకి పని కల్పిస్తాం
జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. కూలీలకు సౌకర్యాలు కల్పించి పనులు చేయిస్తున్నాం. కూలీల సంఖ్య పెంచడానికి ప్రణాళికపరంగా ముందుకెళ్తాం. జాబ్‌కార్డులు లేని వారు గ్రామ పంచాయతీలో కార్యదర్శులకు దరఖాస్తులు చేసుకుంటే అందిస్తాం.
–రాథోడ్ సురేందర్, ఈజీఎస్ ఏపీవో, నార్నూర్