ఇంద్రవెల్లి, మార్చి 13 : మండలంలోని ఏమాయికుంట గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో విద్యుత్ వైర్లు తగిలి గడ్డితో నిండిన వాహనం కాలిపోయింది. స్థానికులు, వాహనం డ్రైవర్ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ మండలం లిమ్గూడ గ్రామానికి చెందిన బొలెరో ట్రాలీ వాహనంలో ఏమాయికుంట గ్రామ సమీపంలోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమి ఉంది. అక్కడి నుంచి పశువుల కోసం గడ్డి, చొప్పను వాహనంలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో చేన్లలో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో మంటలు చెలరేగాయి. స్థానికుల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. ఉట్నూర్ అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ అధికారులు రాజలింగు, రవీందర్, వేణు, మాణిక్రావ్, సిబ్బంది అక్కడి వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే వాహనం 70శాతం, చొప్ప, గడ్డి పూర్తిగా కాలిపోయింది.