ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
కొత్తపల్లెలో మెగా వైద్య శిబిరం
బోథ్, మార్చ్ 8: అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించవద్దని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి గ్రామస్తులకు సూచించారు. బోథ్ మండలం కొత్తపల్లె గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత గ్రామాలుగా ఉన్న పల్లెలు అభివృద్ధికి నోచుకోలేక పోయాయన్నారు. పదేండ్లుగా మారుమూల పల్లెల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. మళ్లీ ఈ మధ్యే ఉనికి కోసం మావోయిస్టులు మారుమూల గ్రామాలకు వచ్చారని తెలిపారు. వారిని వెంబడించి ఛత్తీస్‌గఢ్‌కు పంపించామని చెప్పారు. మావోయిస్టులను మళ్లీ రానిస్తే పల్లెల్లో అభివృద్ధి కుంటు పడుతుందన్నారు. పల్లెల్లో వారి బీజం పడకుండా అందరూ కలిసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. సుదూర ప్రాంతాల్లోని ఆదివాసీ గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలనే సంకల్పంతో మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నామన్నారు.
పరీక్షలు చేయించుకున్న వారికి మందులు అందించడంతో పాటు మెరుగైన చికిత్సలు అవసరమైన వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లేలా చూస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం యువతకు అవసరమైన శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ఇప్పటికే ఆదిలాబాద్‌లో 250 మందికి శిక్షణ ప్రారంభించామని చెప్పారు. ఉట్నూర్‌లో మరో 200 మందికి శిక్షణ ఇప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆదివాసీ గిరిజన పిల్లలు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారని, దీనిని ప్రభుత్వం గుర్తించిందని తెలతిపారు. గిరిజనులకు మెరుగైన విద్య అందించడానికి గురుకులాలను ప్రారంభించిందని, ప్రతి పిల్లవాడిని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. సమాజంలో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అడిషనల్ ఎస్పీ వినోద్‌కుమార్, డీఎస్పీ ఎన్ఎస్వీ వెంకటేశ్వర్రావు, బోథ్ సీఐ ముదావత్ నైలు, ఎస్ఐలు దివ్యభారతి, అజయ్, బోథ్ జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, సర్పంచ్ కొడప విజయ్, ఎంపీటీసీ గొడం జగధిరావు, డాక్టర్ ఆర్ రవీంద్రప్రసాద్, పంద్రం శంకర్, సార్మేడి ఆడెం భీంరావు, వివిధ గ్రామాల పటేళ్లు, దేవరి పాల్గొన్నారు. అంతకు ముందు మొదటి సారిగా తమ ప్రాంతానికి వచ్చిన ఎస్పీకి గిరిజనులు ఘన స్వాగతం పలికారు. డోలు వాయిస్తూ థింసా, సంప్రదాయ నృత్యం చేశారు.
మెగా వైద్య శిబిరానికి స్పందన..
పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. కొత్తపల్లె, రేండ్లపల్లె, నక్కలవాడ, లక్ష్మీపూర్, పట్నాపూర్, బాబెర తదితర గ్రామాల నుంచి గిరిజనులు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. బోథ్ దవాఖాన సూపరింటెండెంట్ రవీంద్రప్రసాద్, సొనాల పీహెచ్సీ వైద్యుడు నవీన్‌రెడ్డి, ఆదిలాబాద్ రిమ్స్ నుంచి వచ్చిన డాక్టర్లు, ఆఫ్తాల్మిక్ ఆఫీసర్ భాస్కర్‌రావు పరీక్షలు చేశారు. మందులు అందజేశారు.