ఆదిలాబాద్, డిసెంబరు 14( నమస్తే తెలంగాణ): యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేస్తున్నది. ఇప్పటికే పలు ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 80,039 ఉద్యోగాలకు అదనంగా పలు శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కొత్తగా 7,029 ఉద్యోగాల భర్తీ చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో బీసీ గురుకులాల్లో 2,591, సైబర్ సేప్టీలో 3,966, ఆర్‌అండ్‌బీలో 472 పోస్టులు ఉన్నాయి. సర్కారు ఉద్యోగాలు సాధించడానికి యువత ఉత్సాహంగా పోటీ పడుతున్నారు. స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రభుత్వం నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నది.
స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నది. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి కూడా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను సాధించడానికి వారికి సహాయ, సహకారాలు అందిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుండడంతో విద్యార్థుల్లో జోష్ నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3919 సర్కారు ఉద్యోగాలు భర్తీకానున్నాయి.
ఆదిలాబాద్‌లో 1193, నిర్మల్‌లో 876 , కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 825, మంచిర్యాల జిల్లాలో 1025 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలోకి వచ్చే బాసర జోన్లో 2328 ఉద్యోగాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోకి వచ్చే కాళేశ్వరం జోన్లో 1630 ఉద్యోగాలు, నాలుగు జిల్లాల పరిధిలో ఉండే మల్టీజోన్-1లో 6800 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. నియామకాల్లో భాగంగా జోనల్ విధానాన్ని అమలు చేయనుండడంతో స్థానికులకే అటెండర్ నుంచి ఆర్డీవో వరకు ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన 80,039 ఉద్యోగాలే కాకుండా అదనంగా పలు శాఖల్లో పోస్టులను భర్తీ చేయనుంది. ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కొత్తగా 7029 ఉద్యోగాల భర్తీ చేపట్టాలని నిర్ణయించారు. సర్కారు ఉద్యోగాల సాధించడానికి యువత ఉ త్సాహంగా పోటీ పడుతున్నారు. స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రభుత్వం నిరుద్యోగులకు చేయూనందిస్తున్నది. సర్కారు అందిస్తున్న సాయంతో నిరుద్యోగులు ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు.
సద్వినియోగం చేసుకుంట..
నేను ఎంఏ తెలుగు పూర్తి చేశా. ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రభుత్వం శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇప్పటికే పలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియ చేపట్టింది. ఇది నిరుద్యోగులకు వరం. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకొని ఉద్యోగం సాధిస్తా.
–ప్రశాంత్‌గౌడ్, ఆదిలాబాద్
మెటీరియల్ బాగుంది
నేను బీకాం కంప్యూటర్ పూర్తి చేశా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న. ఆది లాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్-4 ఉద్యోగం కోసం ప్రిపేరవుతున్న. ప్రభుత్వం పంపిణీ చేసిన మెటీరియల్ చాలా బాగుంది. వివిధ అంశాలతో కూడిన పుస్తకాలు ఉద్యోగం సాధించడానికి ఉప యోగపడుతాయి. కచ్చితంగా సాధించాలనే తపనతో చదువుతున్న.
– సయ్యద్ అమీర్, ఆదిలాబాద్
నిరుద్యోగులకు మంచి అవకాశం
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా ని ర్వహిస్తున్నది. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు పరీక్షల ను పూర్తి చేసింది. దీంతో పాటు ఇటీవల క్యాబినెట్ సమావేశంలో 7029 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేని విధం గా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సర్కారు కొలువులు సాధించాలి. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యువతకు వివిధ పోటీ పరీక్షల కోసం శిక్షణని స్తున్నాం. లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచాం.
– ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్, బీసీ స్టడీ సర్కిల్, ఆదిలాబాద్