నిర్మల్ టౌన్/ఎదులాపురం, డిసెంబర్ 6 : రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించేలా కృషిచేద్దామని ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు పిలుపునిచ్చారు. పల్లె దవాఖానలో ప్రజారోగ్యం మెరుగుపడేలా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. జగిత్యాల నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులతో మలివిడుత కంటి వెలుగు నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం, అధికారుల సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయించిందని, వంద రోజుల్లో ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమాన్ని అన్ని విభాగాల్లోని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలన్నారు. మొదటి విడతకు మంచి స్పందన లభించిందని తెలిపారు. ఇప్పుడు 1500 టీమ్‌ల ఏర్పాటుతో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిషన్గ్లాసెస్ ఉంటాయని, కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే అవసరమైన అద్దాలు ఆయా జిల్లాలకు పంపిణీ పూర్తి చేయాలన్నారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల లోపు షెడ్యూల్ ప్రకారం పని దినాలలో పరీక్షలు చేయాలని తెలిపారు. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకొని బృందాలతో ఈ పరీక్షలను చేపట్టాలని, వారికి అన్ని వసతులు కల్పించాలని సూచించారు. గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాలో మెరుగైన వసతులు అందించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడుతూ.. కంటి వెలుగు, పల్లె దవాఖానలో ప్రగతి వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్ అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, రిజ్వాన్ బాషా షేక్, డీఎంహెచ్వోలు ధన్‌రాజ్, నరేందర్ రాథోడ్, డీపీవోలు శ్రీలత, శ్రీనివాస్, పీఆర్‌ఈఈ మహావీర్, మున్సిపల్ ఈఈ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.